25-03-2025 12:00:00 AM
రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్
ముషీరాబాద్, మార్చి 24, (విజయక్రాంతి): మధ్యభారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం -సిపిఐ (మావోయిస్టు) భేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ అడ్వకేట్ బేల బాటియా, చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. మావోయిస్టుల నేపంతో ఆదివాసులు జీవించే హక్కునే హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణకు చేపట్టాలని కోరారు. చత్తీస్ ఘడ్ మరణకాండపై ఆదివాసీ, హక్కుల సంఘాలు, పౌర, ప్రజాస్వామిక సంఘాల రిపోర్టులు ఆధారంగా సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారతదేశంలో రగులుతున్న హింసా కాండకు గల కారణాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయి నాయకత్వంలో మణిపూర్ కు వెళ్లారు కానీ, హింసతో రగులుతున్న దండ కారణ్యంలోని బస్తీర్ సందర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువత గిరిజన మహిళపై జరుగుతున్న అక్రమ దాడులను వ్యతిరేకించాలన్నారు. ఒకవేళ యుద్ధ వాతావరణంలో ఆపకుండా శాంతి చర్చలు జరుపుకుంటే అమాయక ఆదివాసులు బలవుతున్నారని, అదేవిధంగా కొనసాగితే ప్రజల నుండి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు,కందిమల్ల ప్రతాపరెడ్డి, జర్నలిస్టు దుర్గాప్రసాద్, మాజీ మావోయిస్టు సీసీఎం జంపన్న, ఎం వి ఎస్ ఫౌండేషన్ ఆర్. వెంకట్ రెడ్డి, రచయిత అనిశెట్టి సాయికుమార్, జి .రాములు, తదితరులు పాల్గొన్నారు.