17-11-2025 07:38:17 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి (విజయక్రాంతి): సెంట్రింగ్ యూనిట్ల లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. సెంట్రింగ్ శిక్షణ పొందిన 32 మంది లబ్ధిదారులకు శిక్షణ సర్టిఫికేట్లు సోమవారం అందజేశారు. యూనిట్‌ల స్థాపనకు ఆర్థిక–సబ్సిడీ సహాయంపై ఆయా శాఖలకు సూచనలు చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెంట్రింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి శిక్షణ పొందిన 32 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ సోమవారం కలెక్టరేట్ లో సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులు శిక్షణ పూర్తి చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందేందుకు ముందడుగు వేశారు. సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో శిక్షణ పొందిన లబ్ధిదారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం కావడానికి సెంట్రింగ్ సేవలు అత్యంత అవసరమని, శిక్షణ పొందిన మీరు ఈ నిర్మాణ కార్యాచరణలో భాగస్వాములు కావాలన్నారు. ఇది మీ ఉపాధికి మాత్రమే కాదు, జిల్లా గృహ నిర్మాణ పురోగతికి కూడా తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారులు తమ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం, సబ్సిడీలు అందించేందుకు పరిశ్రమల శాఖ, బ్యాంకులు, డీఆర్డీఏ మధ్య సమన్వయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకు అవసరమైన సహకారాన్ని డిఆర్డిఏ అధికారులు వెంటనే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, పరిశ్రమల శాఖ అధికారులు, అదనపు డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, డిపిఎం సాయిలు, ఏపిఎం రాజేందర్, అలాగే లబ్ధిదారులు పాల్గొన్నారు.