14-08-2025 02:06:53 AM
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు, పంటలతో కేంద్రం ఆటలు ఆడుతోందని మండిపడ్డారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా ఏప్రి ల్, జూలైలో 32 శాతం లోటు, - మే నెలలో 45% లోటు, ఆగస్టులోనూ 35 శాతం కొరత చేసిందని విమర్శించారు.
కేటాయింపులలో దిగుమతి యూరియాకే సింహభా గం కేటాయించి, నౌకల వివరాలను కేంద్రం తెలపడం లేదని మంత్రిపేర్కొన్నారు. - ఏప్రిల్ నుంచి జూలై వరకు 2.10 శాతం లోటు, ఆగస్టులో 0.57 శాతం లోటును తక్షణమే భర్తీ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా యూరియా సరఫరాపై కేంద్ర సహాయ మంత్రి తప్పుడు ప్రకటన చేశారని, కేంద్ర నిర్లక్ష్యంపై పోరాటం కొనసాగుతుంతుందన్నారు.
రాష్ర్టం తరఫున ఎన్ని లేఖ లు రాస్తే .. లేఖల మీదనే తెలపడం తప్ప, రాష్ట్రానికి కేంద్రం చేసిందేమి లేదని తుమ్మల విమర్శించారు. రాష్ర్ట రైతులకు ప్రయోజనం చేకూరేం దుకు రాజకీయాలన్నింటిని పక్కన పెట్టి, ఎన్నోసార్లు కేంద్రం తలపు తట్టామన్నారు. కేంద్రం తెలంగాణ ర్రాష్టంపై శీతకన్ను వేస్తుందన్నారు.. కనీసం రాష్ర్టం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులను కోరిన ఫలితం ఉంటుందేమో అనుకుంటే, వారు కూడా రాజకీయ ప్రకటనలు చేయడం తప్ప, రాష్ర్ట రైతాంగం తరపున కేంద్రంతో మాట్లాడింది లేదు అని మంత్రి పేర్కొన్నారు.
రాష్ర్టంలో రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఆగసులో అవసరం 3 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని కోరామన్నారు. రైతులు పంట పొలంలో ఉండాల్సిన సమయంలో, ఎరువుల కోసం క్యూల్లో నిలబడే పరిస్థితిని కేంద్రం సృష్టించిందని మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు.