calender_icon.png 14 August, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాల ఎర్ర చెరువును కబ్జాదారుల నుండి రక్షించాలి

14-08-2025 04:41:52 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం(Bellampalle Mandal)లోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోగల ఎర్ర చెరువును రియల్ ఎస్టేట్ కబ్జాదారుల నుండి కాపాడాలని సంయుక్త కిసాన్ మోర్చా, సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం వారు ఎర్ర చెరువును పరిశీలించారు. కన్నాల ఎర్ర చెరువు కింద భూములకు సాగునీరు, మత్స్యకారులకు చేపల పెంపకం, గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాడి చెట్లను తొలగించారని ఆరోపించారు. కన్నాల ఎర్ర చెరువుతో పాటు స్థానికంగా ఉన్న సుబ్బారావు తోటలో మరొక చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారులు గండి కొట్టారని ఆరోపించారు. చెరువులను గండి కొట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కన్నాల రైతులకు జీవన ఉపాధి అయిన ఎర్ర చెరువును కుదిస్తూ కబ్జా చేశారని వారు ఆరోపించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు ఎఫ్ టీ ఎల్  లెవెల్ లో ప్లాట్లను విక్రయిస్తున్నారని, ప్లాట్లు ముంపుకు గురి కాకుండా ఏకంగా చెరువుకు గండి కొట్టారని ఆరోపించారు. గతంలో కన్నాల, లక్ష్మీపూర్ గ్రామాల ప్రజలతో పాటు మాజీ సర్పంచ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎర్ర చెరువు ఆక్రమణపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరారు. లేనట్లయితే రైతులు, గీత కార్మికులు, మత్స్యకారుల ఆధ్వర్యంలో చేపట్టే పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎండి చాంద్ పాషా, టిడిపి నాయకులు మని రామ్ సింగ్, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ నాయకులు గోగర్ల శంకర్, సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ అంబాల మహేందర్, టిడిపి నాయకులు బొల్లు మల్లయ్య, వేల్పుల శంకర్, దాసరి కుమార్, దుగుట రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.