14-08-2025 04:44:55 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా పేరొందిన బెల్లంపల్లి బల్దియాలో చెత్త తొలగింపుపై అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. బల్దియాలో 34 వార్డులుండగా కొన్ని వార్డుల్లో మాత్రమే పేరుకుపోయిన చెత్త నిలువలను తొలగిస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంటోంది. కొన్ని మున్సిపల్ వార్డులలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారినప్పటికీ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక కార్మిక వాడలలో అస్సలు పట్టించుకోకపోతుండడంతో ఇళ్ల మధ్యనే చెత్తాచెదారం కుప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని రామా టాకీస్ ప్రాంతంలో చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందుతుండడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో కిరాణం వ్యాపారాలు కొనసాగుతుండడంతో నిత్యం చెత్త నిల్వలు పేరుకు పోతున్నాయని, మునిసిపల్ సిబ్బంది రోజుల తరబడి తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ క్వార్టర్ల మధ్య చెత్తాచెదారం పేరుకుపోయి పందులు స్వైర విహారం చేస్తున్నప్పటికీ పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. ప్రతి వార్డుకు చెత్తను తొలగించేందుకు వాహనంతో పాటు సిబ్బందిని కేటాయిస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికైనా బెల్లంపల్లి బల్దియాలో పలు వార్డుల్లో చెత్త తొలగింపు పై అధికారులు నిర్లక్ష్యం వీడాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది.