25-08-2025 01:53:01 PM
సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్
మునుగోడు (విజయక్రాంతి): రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యావని సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్(CPM Mandal Secretary Sagarla Mallesh) అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని మునుగోడు వ్యవసాయ అధికారి పద్మజకు సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడ యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర బిజెపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర రైతాంగానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేంద్రం ఇచ్చిందని దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా పై పోరాడకుండా కల్లప్పగించి చూస్తూ, రైతులను ఇబ్బందులు పెట్టడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు లేకపోవడం వలన గ్రామాలలో ప్రజా సమస్యలు కుప్పలు కుప్పలుగా పేరుకపోయావని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం యూరియా కోసం బారులు తీరుతున్నారని, అనేకమంది అస్వస్థకు గురై గాయాలు పాలవుతున్నారని అన్నారు. యూరియా కొరతేలేదని అధికారులు చెప్పడం సరైన పద్ధతి కాదని, తెలంగాణ రాష్ట్రానికి రైతులకు సరిపడా యూరియాను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు యాసరాణి శ్రీను, వేముల లింగస్వామి, రైతులు అంజయ్య, లింగయ్య ఉన్నారు.