‘తండేల్’ ఓటీటీ రైట్స్ 40 కోట్లు?

30-04-2024 12:05:00 AM

ప్రస్తుత సినిమాల నిర్మాణ వ్యయం ఓటీటీ మార్కెట్‌పైనే ఆధారపడి ఉన్నదన్నది కాదనలేని విషయం. ఓ సినిమా నిర్మాణానికి ముందే ఓటీటీ హక్కుల మార్కెట్‌ను అంచనా వేసుకుని సినిమా మేకింగ్‌కు శ్రీకారం చుడుతున్నారు నిర్మాతలు. ఇటీవల 280 కోట్ల  ఓటీటీ డీల్‌తో  కొత్త రికార్డు నెలకొల్పింది అల్లు అర్జున్  ‘పుష్ప2’ ది రూల్ చిత్రం. ఇప్పుడు ఇదే బాటలో నాగచైతన్య కొత్త చిత్రం ‘తండేల్’ కూడా ఓటీటీ డీల్‌ను పూర్తిచేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్  ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులు హీరో నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 40 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘తండేల్’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో నిండిన రా రస్టిక్ ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతన్య రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నారు. కథానాయిక సాయిపల్లవి కూడా మునుపెన్నడు లేని విధంగా డీ గ్లామర్ రోల్‌లో కనిపించనుందని సమాచారం.