09-10-2025 05:08:28 PM
తలసాని, కేటీఆర్ తో కలిసి చలో బస్ భవన్ కార్యక్రమం.
సనత్‌నగర్ (విజయక్రాంతి): వెస్ట్ మారేడ్‌పల్లిలోని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్(MLA Talasani Srinivas) యాదవ్ క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం కొద్దిసేపు హైడ్రామా చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “చలో బస్ భవన్” కార్యక్రమం నేపథ్యంలో నగరంలోని పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. హౌస్ అరెస్ట్ ఆదేశాలపై సమాచారం ఇవ్వగా, తలసాని స్పందిస్తూ.. “మేమెవ్వరూ అల్లర్లు చేయడం లేదు. బస్సులో బస్ భవన్ వరకు వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తాం,” అని తెలిపారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి సైలెంట్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు శ్రీహరి, నరేందర్ రావు తదితరులు ఉన్నారు.
కేటీఆర్ తో కలిసి బస్ భవన్‌కు తలసాని యాత్ర
బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమం విజయవంతమైంది. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ లు బస్ భవన్ వైపు బయలుదేరారు.ముందుగా తలసాని క్యాంప్ కార్యాలయ వద్ద కేటీఆర్ కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, యువనేత తలసాని సాయికిరణ్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వెస్ట్ మారేడ్‌పల్లి నుండి రెతీఫైల్ బస్టాండ్ చేరుకున్న నేతలు అక్కడ 2 నెంబర్ బస్సులో ప్రయాణిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు భారీ కేడ్లతో అడ్డుకట్ట వేయడంతో నాయకులు కాలినడకన బస్ భవన్ చేరుకున్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బస్సు చార్జీల పెంపుతో ప్రజలపై భారమవుతుందని, ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.