calender_icon.png 17 September, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జజ్జనకరిజనారే.. జగజ్జేత భారతే

30-06-2024 01:22:51 AM

టీ20 ప్రపంచకప్ కైవసం

ఫైనల్లో 7 పరుగులతో జయభేరి.. మెరిసిన కోహ్లీ, అక్షర్

  • రెండోసారి టీ20 ప్రపంచకప్ కైవసం

• ఫైనల్లో దక్షిణాఫ్రికాపై జయభేరి

• దంచికొట్టిన కోహ్లి, అక్షర్

• నిప్పులు చెరిగిన బుమ్రా, అర్ష్

• మలుపుతిప్పిన హార్దిక్ పాండ్యా

• సఫారీ రన్నరప్ సరి

జయహో భారత్..! టీమిండియా అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్ చేరిన రోహిత్ సేన.. తుది పోరులో సఫారీలను చిత్తుచేసి రెండోసారి వరల్డ్‌కప్ చేజిక్కించుకుంది. చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈ ఫార్మాట్‌లో తొలిసారి (2007లో) నిర్వహించిన ప్రపంచకప్‌లో ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా.. 

మళ్లీ 17 ఏళ్ల తర్వాత రెండోసారి కప్పును ముద్దాడింది. ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఒత్తిడిని తట్టుకోలేక చివరి దశలో ఇంటిదారి పట్టిన భారత్.. ప్రపంచకప్‌లో ఆ పొరబాటు జరగనివ్వలేదు.

టాస్ గెలవడంతోనే మ్యాచ్ గెలిచినట్లు అనిపించినా.. టాపార్డర్ విఫలమవడంతో ఒక దశలో భారత్ వెనుకబడ్డా.. పోరాట యోధుడు విరాట్ కోహ్లీ మరోసారి తన విలువ చాటుకోవడంతో.. (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (47; ఒక ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకు పరిమితమైంది. హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) భయపెట్టగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా..  బుమ్రా, అర్ష్‌దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.  

3 - రోహిత్ శర్మ ఆడిన టీ20 ప్రపంచకప్ ఫైనల్స్. 2007లో చాంపియన్ గా నిలిచిన భారత జట్టులో రోహిత్ సభ్యుడు కాగా.. 2014 రన్నర ప్గా నిలిచిన జట్టులోనూ హిట్ మ్యాన్ ఉన్నాడు. భారత్ తరఫున మూడు పొట్టి ప్రపంచకప్ ఫైనల్ ఆడిన ఏకైక ప్లేయర్ రోహిత్, ధోనీ, యువరాజ్, కోహ్లి, జడేజా రెండు ఫైనల్స్ ఆడారు

8 - భారత్ తరఫున అత్య ధిక (8) ఫైనల్స్ ఆడిన ప్లేయర్లుగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రికార్డుల్లోకెక్కారు. యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా ఏడేసి ఫైనల్స్ రెండో స్థానంలో ఉన్నారు.

176/7 - టీ ప్రపంచకప్ ఫైనల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో (2021) తుదిపోరులో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా 173/2 స్కోరు చేసింది.

15 -  టీ20 ప్రపంచకప్ ఫైనల్ తొలి ఓవర్లో భారత్ చేసిన పరు. గులు. మెగా టోర్నీ మొదటి ఓవర్లో ఇవే అత్యధిక రన్స్

9 - టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టాస్ గెలిచిన జట్టే విజేతగా నిలిచే సంప్రదాయం తొమ్మిదోసారి కూడా కొనసాగింది. 

2 - టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లికిది రెండో అర్థశతకం. 2014 తుదిపోరులోనూ అతడు శ్రీలంకపై 77 రన్స్ చేశాడు.

2012, 2016, 2021, 2022 - వరల్డ్ కప్ ఫైనల్స్ చేజింగ్ చేసిన జట్లు విజేతగా నిలవగా.. ఈ సారి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ విజయ పతాక ఎగరేసింది.

ఆహా ఏమా మ్యాచ్.. ఏమా ఉత్కంఠ! బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతుంటే.. పరుగు పరుగుకు సమీకరణాలు తారుమారవుతుంటే.. మైదానంలో ఆడుతున్నది 11 మందే అయినా.. యావత్ భారతం తామే మహాసంగ్రామంలో పాల్గొంటున్నట్లు ఊగిపోయిన క్షణాన..టీమిండియా అద్భుతం చేసింది. పదమూడేళ్ల తండ్లాట తీర్చుతూ ఐసీసీ ప్రపంచకప్ ట్రోపీని సగర్వంగా ముద్దాడింది. 

చరిత్రలో నిలిచిపోయేలా సాగిన ఫైనల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మెగాటోర్నీ ఫైనల్స్ ఇప్పటి వరకు ఎవరూ చేయనన్ని పరుగులు చేసిన టీమిండియా.. విజయం కోసం చివరి ఓవర్ వరకు తెగించి కొట్లాడింది. ఆఖరి ఐదు ఓవర్లుతై నభూతో! టెన్షన్‌లో రక్తం మరగడం అంటే ఏంటో.. ఒత్తిడిలో మునివేళ్లపై నిల్చోవడం అంటే ఎలా ఉంటుందో.. భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ చూసిన వాళ్లకు సరిగ్గా తెలిసి ఉంటుంది. మ్యాచ్ దాదాపు చేజారినట్లే కనిపించిన తరుణం నుంచి.. తిరిగి పుంజుకునేంత వరకు సాగిన ఆ సమరం మహాద్భుతం.ఆ ఒత్తిడిని తనదిగా భావిస్తే.. నరాల స్థానంలో ఉక్కు తీగలు ఉన్నా తెగిపడేవే! 

బ్రిడ్జ్‌టౌన్: టీమిండియా సాధించింది. ఇన్నాళ్లు అంది ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోపీని 13 ఏళ్ల తర్వాత కైవసం చేసుకుంది. నిరుడు వన్డే ప్రపంచకప్ తుదిమెట్టుపై తడబడ్డ భారత్.. ఈసారి ఎలాంటి పొరబాటుకు తావివ్వకుండా.. టీ20 ప్రపంచకప్ చేజిక్కించుకుంది. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన పోరులో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫికాను ఓడించి జగజ్జేతగా అవతరించింది. శనివారం జరిగిన తుదిపోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో అదరగొట్టగా.. అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఒక ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, రబాడ ఒక్కో వికెట్ తీశారు. టోర్నీ ఆసాంతం రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ (9) రెండో ఓవర్‌లోనే వెనుదిరగగా.. రిషబ్ పంత్ (0), సూర్యకుమార్ యాదవ్ (3) పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీ బాదగా.. క్వింటన్ డికాక్ (39; 4 ఫోర్లు, ఒక సిక్సర్), స్టబ్స్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. ఆఖర్లో మిల్లర్ (21; ఒక ఫోర్, ఒక సిక్సర్) భయపెట్టినా జట్టును గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, బుమ్రా, అర్ష్‌దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.

భయపెట్టిన క్లాసెన్  

నెల రోజుల క్రితం అతడు సిక్సర్లు బాదుతుంటే.. సంబరపడ్డ సగటు భారత క్రీడాభిమానులను.. అతడే శోకసంద్రంలో ముంచెత్తాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగి సిక్సర్ల సునామీ సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పాలిట యముడిగా పరిణమించాడు. 12 పరుగులకే 2 వికెట్లు పడగొట్టి.. మంచి జోరు కనబర్చిన రోహిత్ సేనను డికాక్, స్టబ్స్ బ్యాక్‌ఫుట్‌పైకి నెట్టేస్తే.. క్లాసెన్ ఊచకోతతో పాతాళంలో పడేశాడు. టోర్నీ మొత్తం చక్కటి బౌలింగ్‌తో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన మన స్పిన్నర్లను క్లాసెన్ చెడుగుడు ఆడుకున్నాడు. దీంతో అక్షర్, కుల్దీప్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే.. కీలక దశలో పాండ్యా అతడిని ఔట్ చేయగా.. చివర్లో మన పేసర్లు కట్టుదిట్టమైన బంతులతో కట్టి పడేయడంతో భారత్ రెండోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 

స్కోరు వివరాలు

భారత్: రోహిత్ (సి) క్లాసెన్ (బి) మహరాజ్ 9, కోహ్లీ (సి) రబాడ (బి) జాన్సెన్ 76, పంత్ (సి) డికాక్ (బి) మహరాజ్ 0, సూర్యకుమార్ (సి) క్లాసెన్ (బి) రబాడ 3, అక్షర్ (రనౌట్) డికాక్ 47, దూబే (సి) మిల్లర్ (బి) నోర్జే 27, పాండ్యా (నాటౌట్) 5, జడేజా (సి) మహరాజ్ (బి) నోర్జే 2, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం 20 ఓవర్లలో 176/7. వికెట్ల పతనం: 1 2 3 4 5 6 7 బౌలింగ్: జాన్సెన్ 4 కేశవ్ మహరాజ్ 3 రబాడ 4 మార్కరమ్ 2 నోర్టే 4 షంసీ 3

దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్ (బి) బుమ్రా 4, డికాక్ (నాటౌట్) 39, మార్కరమ్ (సి) పంత్ (బి) అర్ష్‌దీప్ 4, స్టబ్స్ (బి) అక్షర్ 31, క్లాసెన్ (సి) పంత్ (బి) పాండ్యా 52, మిల్లర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 21, జాన్సెన్ (బి) బుమ్రా 2, కేశవ్ (నాటౌట్) 2, రబాడ (సి) సూర్య (బి) పాండ్యా 4, నోర్జే (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 169/8. వికెట్ల పతనం: 1 2 3 4 5 6 7 8 బౌలింగ్: అర్ష్‌దీప్ 4 బుమ్రా 4 అక్షర్ 4 కుల్దీప్ 4 పాండ్యా 3 జడేజా 1 

ఎవరైనా ఊహిస్తారా!

177 పరుగుల ఛేదనలో 15 ఓవర్లు ముగిసేసరికి.. దక్షిణాఫ్రికా 147/4తో నిలిచింది. హెన్రిచ్ క్లాసెన్ అప్పటికే రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది అర్ధశతకానికి ఒక పరుగు దూరంలో ఉండగా. డేవిడ్ మిల్లర్ ఒక సిక్స్, ఒక ఫోర్‌తో ఉన్నాడు. సఫారీ జట్టు తొలిసారి విశ్వ విజేత కిరీటం దక్కించుకోవాంటే 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉండగా.. 

రాకెట్ వేగంతో సాగుతున్న ప్రొటీస్‌కు 16 ఓవర్లో బుమ్రా కళ్లెం వేశాడు. అప్పటి వరకు సిక్సర్లతో మాట్లాడుతున్న క్లాసెన్, మిల్లర్‌ను కట్టిపడేశాడు. కేవలం 4 పరుగులే ఇచ్చి ఒత్తిడి పెంచగా.. తదుపరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా క్లాసెన్‌ను వెనక్కి పంపడంతో పాటు 4 రన్సే ఇచ్చాడు. అదే తీవ్రత కొనసాగించిన బుమ్రా.. 18వ ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి జాన్సెన్‌ను ఔట్ చేయడంతో సఫారీల విజయ సమీకరణం 12 బంతుల్లో 20కి మారింది. 19వ ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ 4 పరుగులే ఇవ్వడంతో.. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు మిగిలాయి. తొలి బంతికే ప్రమాదకర మిల్లర్‌ను ఔట్ చేసిన పాండ్యా.. మ్యాచ్‌ను మనవైపు తిప్పాడు.