11-05-2025 10:57:21 PM
ప్రధాన రహదారిపై చెక్ పోస్ట్ ఉన్న... అక్రమ రవాణాకు అడ్డే లేదు
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో చెకింగ్ లేని చెక్ పోస్ట్ చూడాలనుకుంటున్నారా... అయితే మంథని-భూపాలపల్లి జిల్లా సరిహద్దులోని మంథని-కాటారం ప్రధాన రహదారి పై మంథని మండలం ఎగ్లాస్ పూర్ లో మీరు చూడొచ్చు. ప్రధాన రహదారిపై చెక్ పోస్ట్ ఉన్న అధికారులు లేకపోవడంతో అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ సంపదను అక్రమంగా తరలిపోకుండా ఈ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఒకప్పుడు మహారాష్ట్ర, చతిస్ గాడ్ రాష్ట్రాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సరిహద్దుగా ఈ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు.
ఇటీవల ఈ చెక్ పోస్ట్ పై ఉన్నతాధికారుల నిఘా లేకపోవడంతో ఈ చెక్ పోస్ట్ చెకింగ్ లేని చెక్ పోస్ట్ గా మారింది. రోజు వందల్లో వాహనాలు ఈ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుంటే ఈ చెక్ పోస్ట్ వద్ద కనీసం అటవీ శాఖ అధికారులు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయకపోవడంతో పాటు వాహనాలు ఆపేందుకు గేటు కూడా అమర్చలేదు. రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున డ్యూటీలు చేసే అటవీశాఖ అధికారులు ఈ చెక్ పోస్ట్ తో మాకేం పని అన్నట్లు వ్యవహరిస్తూ వారి సొంత పనులు చేసుకుంటున్నారని చుట్టుపక్కల వారు తెలుపుతున్నారు. అక్కడికి వచ్చిన వారిని కాపలా ఉంచుతూ అధికారులు మాత్రం తన సొంత పనులు చేసుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే ప్రధాన రహదారి పక్కనే చెక్ పోస్ట్ ఉందని, అధికారులేని ఈ చెక్ పోస్ట్ నుంచి రోజుకు ఎన్ని కలప వాహనాలు పోతున్నాయో, అక్రమంగా ఎన్ని తరలిపోతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. గతంలో అక్రమంగా టేకు కలప, రేషన్ బియ్యం లారీలను పట్టుకొని అప్పటి అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. కానీ ఇప్పుడు అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ చెక్ పోస్ట్ ను తూతూ మంత్రంగానే విధులు నిర్వహించుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై పెద్దపెల్లి జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య ను వివరణ కోరగా ఈ చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని, అధికారులు గునుక లేకపోతే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.