12-05-2025 06:01:13 PM
భక్తులతో కిక్కిరిసిన మల్లూరు క్షేత్రం
వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
ములుగు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ది చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో శ్రీలక్ష్మీ నృసింహ స్వామి తిరు కళ్యాణ వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు సోమవారం ఉదయం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలతో కళ్యాణ మంటపానికి తోడ్కొని వచ్చి కళ్యాణ వేడుకలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో శ్రీ లక్ష్మీనృసింహస్వామికి పాణిగ్రహణం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాంగల్య ధారణ కార్యక్రమం, ముత్యాల తలంబ్రాలు పోసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామి వారి కళ్యాణ వేడుకల తలంబ్రాల కోసం భక్తులు ఎగబడ్డారు. కళ్యాణ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడంతో హేమాచల క్షేత్రం (మల్లూరు గుట్ట) భక్తులతో కిక్కిరిసిపోయింది. కళ్యాణ వేడుకలలు ఆలయ ఈ వో శ్రవణం సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, ఆలయ అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు బృందం, శ్రీహేమాచల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, శ్రీహేమాచల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ రిటైర్డ్ ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకటనారాయణ శర్మ, ఉత్సవ కమిటీ చైర్మన్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మల్లూరు అభివృద్ధికి కృషి మంత్రి సీతక్క హామీ
మల్లూరు హేమాచల క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని సీతక్క హామీ ఇచ్చారు. సోమవారం నిర్వహించిన స్వామివారి తిరు కల్యాణ వేడుకల్లో మంత్రి, కలెక్టర్ దివాకర టిఎస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.