12-05-2025 05:50:52 PM
ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ దేవానంద్
మందమర్రి,(విజయక్రాంతి): పారిశ్రామిక శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులు వృత్తి నైపుణ్యం పెంచుకొనేందుకు అప్రెంటిస్ మేళా దోహద పడుతుందని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ జి దేవానంద్ అన్నారు. పట్టణంలోని ఐటిఐలో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు వివిధ సంస్థల్లో అప్రెంటిస్ గా చేరడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తద్వారా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో వారు ఎంచుకున్న వృత్తుల్లో రాణించ వచ్చన్నారు.
పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అప్రెంటిస్ మేళాను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని ఆయన కోరారు. కాగా పట్టణంలో నిర్వహించిన అప్రెంటిస్ మేళాలో షైనీదర్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, ఆదర్శ ఆటోమొబైల్స్ కరీంనగర్, ఎమ్మెస్ శ్రీనివాసరావు కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా ఆయా సంస్థలో 132 ఖాళీలు ఉండగా ఐటిఐ పూర్తి చేసుకున్న 63 మంది అభ్యర్థులు మేలాకు హాజరయ్యారు. వీరిలో 37 మంది ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, ఐటిఐ ఇన్స్ ట్రక్టర్లు, శిక్షణ పొందిన అభ్యర్థులు పాల్గొన్నారు.