calender_icon.png 22 October, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేలిముద్రతో దళారుల దందాకు చెక్!

20-10-2025 12:00:00 AM

  1. పంటల కొనుగోళ్లలో కొత్త విధానం
  2. ఈ ఏడాది నుంచే అమలుకు చర్యలు

కొండాపూర్, అక్టోబర్ 19 :రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించే ప్రక్రియలో దళారులు అడ్డుపడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ’పీఎం-ఆశా’ పథకం అమలు చేస్తూ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు మాత్ర మే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకునే అవకాశం కల్పించింది. దీంతో దళారులకు చెక్ పడనుంది.

అక్రమాల నిరోధానికే..

పత్తి, సోయాబీన్, కంది, మొక్కజొన్న, వరి, పెసర లాంటి అనేక పంటలకు బహిరంగ మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. అయితే దళారులు గ్రామాల్లోకి వెళ్లి తక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు.

ఆ తర్వాత మార్క్ఫెడ్, ఎన్సీసీఎఫ్, సీసీఐతో కుమ్మక్కై మద్దతు ధరకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో పత్తి, సోయాబీన్, జొన్నల కొనుగోళ్లలో ఇలాంటి అవకతవకలకు పాల్పడినట్లు ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతు ధర దక్కేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలు తీసుకువచ్చింది.

కేంద్రాల్లో కొత్త విధానం..

కొత్త నిబంధనల ప్రకారం పీఎస్‌ఎస్ పోర్టల్లో రైతులు తప్పనిసరిగా నమోదు కావాలి. రైతుల ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం వివరాలతో పాటు వ్యవసాయశాఖ నుంచి క్రాప్ బుకింగ్ డేటా (పంట వివరాలు)ను సేకరించి ధ్రువీకరించుకోవాలి. ఈ డేటా మార్క్ ఫెడ్, ఎన్సీసీఎఫ్, సీసీఐ లాంటి నోడల్ ఏజెన్సీలతో అనుసంధానం అవుతుంది. 

బయోమెట్రిక్ లేకుంటే అంతే..

రైతుల పేరిట దళారులు పంటలు విక్రయించకుండా కీలక నిబంధన తీసుకు వచ్చారు. కొనుగోలు కేంద్రంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ లేదా మొబై ల్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు ద్వారా పంటలు కొనుగోలు చేయనున్నారు. ఓటీపీ ద్వారా ధ్రువీకరణకు ఇకపై అనుమతి లేదు. ఇందుకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాల్లో ఈపోస్ యంత్రాలు అమర్చనున్నారు. వీటి ద్వారా కొనుగోళ్లు జరగనున్నాయి.

డబ్బులు నేరుగా రైతు ఖాతాకే..

పంటలు అమ్ముకున్న రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమవుతాయి. ఒకవేళ రైతు నేరుగా కొనుగోలు కేంద్రానికి రాలేని పక్షంలో తన ఆధ్పా గరిష్టంగా ముగ్గురు అధీకృత వ్యక్తులకు అవకాశం ఇవ్వవచ్చు. అధీ కృత వ్యక్తి పంట తెచ్చినా చెల్లింపు మాత్రం రైతు ఖాతాకే వెళ్తుంది. ఈ మార్పులన్నీ కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా ఉంచేందుకు ఉద్దేశించినవని కేంద్రం స్పష్టం చేస్తోంది.

అయితే ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వ కంగా ఆదేశాలు రాలేదని, ఆదేశాలు అందిన వెంటనే విధివిధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.