calender_icon.png 23 January, 2026 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు

23-01-2026 12:00:00 AM

అంగరంగ వైభవంగా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం

తెలంగాణ రెండవ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం

పరశురాముడు ప్రతిష్టించిన 108 వ శివలింగంగా ప్రఖ్యాతి

చిట్యాల, జనవరి22: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి మొదలై ఈనెల 30వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవములకు  తెలుగు రాష్ట్రాల వారే గాక, ఇతర రాష్ట్రాల నుండి  కూడా లక్షలాది భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి వస్తున్న సందర్భంగా అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. 

నమ్మిన భక్తులకు కొంగుబంగారమై విరజిల్లుతున్న పుణ్యక్షేత్రంగా, తెలంగాణ రెండవ శ్రీశైలం గా చెరువుగట్టు దేవాలయం ప్రసిద్ధి. కొలిచిన భక్తులకు చల్లని దీవెనలు అందించే  దేవుడిగా ఈ దేవాలయం ప్రసిద్ధి. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే లు బ్రహ్మోత్సవములకు  హాజరు కానున్నారు. ప్రభుత్వ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.

చెరువుగట్టు ఆలయ చరిత్ర..

త్రేతా యుగంలో పరశురాముడు లోక కళ్యాణం కోసం దేశం మొత్తం తిరుగుతూ 108 శివ లింగాలను ప్రతిష్టించాడని, చివరి శివలింగంగా చెరువుగట్టులోని గుట్ట పై లింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేశాడని, తపస్సును మెచ్చిన శివుడు ప్రత్యక్షమై పరశురా ముడిచే ప్రతిష్టించిన ఈ క్షేత్రం పవిత్ర పుణ్యక్షేత్రంగా, మహిమగల క్షేత్రంగా వెలుగొందు తుందని గుట్టపైన ఉన్న మూడు గుండ్లపై స్వయంగా వెలిచాడని చరిత్ర చెబుతుంది.

కమనీయంగా స్వామి వారి కళ్యాణం

చెరువు గట్టు గుట్టపైన అత్యంత ప్రాముఖ్యత శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం. కళ్యాణ వేడుకను కన్నుల పండుగగా కమనీయంగా ప్రతి ఏటా రథసప్తమి రోజున నిర్వహిస్తారు. అనంతరం తలంబ్రాలు, ఒడి బియ్యం పోయడం ఓ ఘట్టం, స్వామి వారి కళ్యాణం తిలకించడం  కోసం లక్షలాది మంది ప్రతి ఏట తరలి వస్తారు. కళ్యాణ మండపానికి సమీపాన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కళ్యాణాన్ని తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు.

శనివారం తెల్లవారుజామున  శ్రీ పార్వతీ జాడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం , ఆదివారం తెల్లవారుజామున అగ్ని గుండాలు, సోమవారం తెల్లవారుజామున అశ్వవాహన సేవ, రాత్రిపూట ఏకాంత సేవలు స్వామి వారికి నిర్వహించిన అనంతరం 31 వ తేది న బుధవారం సాయంత్రం స్వామి వారి విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించడం తో జాతర పూర్తి అవుతుంది. స్వామి వారి కళ్యాణం కోసం వేలాదిమంది భక్తులు తమ మొక్కులను చెల్లించడం కోసం వడి బియ్యం , తలంబ్రాలు సమర్పన కోసం తరలి వస్తారు.

కోనేటిలో భక్తుల పుణ్యస్నానం. 

ఆలయ సన్నిధిలోని కోనేటిలో స్నానం చేసిన వారికి సకల పాపాలు తొలగి మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పుణ్యా స్నానం ఆచరించిన అనంతరం కోనేటి సమీపంలోని స్వామి వారి పాదాల చెంత ప్రదక్షిణలు ఆచరిస్తారు. గుట్ట కింద శ్రీ పార్వతి దేవి ఆలయం, గుట్టపైన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం, పరశురాముడి ఆలయం, మూడు గుండ్ల పై వెలిసిన శివలింగం, మిక్కిలి ప్రసిద్ధిగా పేరొందినవి. కోరికలు నెరవేరిన భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలను స్వామివారికి సమర్పిస్తుంటారు.