calender_icon.png 15 September, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం

14-09-2025 10:41:38 PM

అమీన్ పూర్,(విజయక్రాంతి): భూస్వాముల దౌర్జన్యానికి దొరల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ ఘట్టమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు తెలిపారు. ఆదివారం అమీన్ పూర్ మున్సిపాలిటీ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వార్షికోత్సవ సభలో చుక్క రాములు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో నాటి పరిస్థితులు తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్టు వివరించారు. గతంలో కుల మతాల ప్రస్తావనేలేదని కులమతాలకు అతీతంగా దొరల అహంకారానికి పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడారని చెప్పుకొచ్చారు.

భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడిన షేక్ బంధగీ అనే రైతును ముస్లిం రాజులు చంపించారని గుర్తు చేశారు. నైజాం రాజకాలను పత్రికల్లో ప్రచురించిన షోయబుల్లాఖాన్ అనే విలేకరిని దారి కాచి దారుణంగా హతమార్చిన ఘటనను తెలిపారు. చేతి వృత్తుల దారులు, రైతులను దారుణంగా భూస్వాములు హింసించారని తెలిపారు. భూస్వాములకు అనుకూలంగా పనిచేయకపోతే ప్రజలు ఆ గ్రామంలో బ్రతికే పరిస్థితి లేదని చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య సుదీర్ఘకాలం నాయకత్వం వహించి తెలంగాణ ప్రజలను భూస్వాములు, పెట్టుబడిదారులు, నిజాం నిరంకుశతో పాలన నుంచి విముక్తి కల్పించారని చెప్పుకొచ్చారు. కామ్రేడ్ సుందరయ్య రచించిన వీర తెలంగాణ విప్లవ పోరాటం అనే గ్రంథం చదివితే అనేకంశాలు మనకు తెలుస్తాయని పేర్కొన్నారు.

ఆ గ్రంథంలో నాటి పరిస్థితులను కండ్లకు కట్టినట్టు వివరించారని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాటంలో భాగస్వామ్యం చేసిందన్నారు. కడివెండి గ్రామంలో తుపాకులు పెట్టి ప్రజలను కాల్చి చంపుతుంటే దొడ్డి కొమరయ్య అనే యువకుడు ఎదురోడ్డి పోరాడారని వివరించారు. ప్రజలు సంఘం బలంతో నిజాం నిరంకుశుత్వానికి పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి చదువుకున్న యువతతో పాటు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి వంటి భూస్వామ్య కుటుంబాలు సైతం రైతాంగ సాయుధ  పోరాటంలో ప్రజల తరఫున విరోచితంగా పోరాడారని చెప్పుకొచ్చారు.

తెలంగాణ సాయుధ రైతన్న పోరాటంలో కులమత ప్రస్తావన అసలే లేదని, దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే పోరాడారని వివరించారు. తెలంగాణలో భూస్వాములు అంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు కాదని.. లక్షల ఎకరాల భూమి ఉంటేనే ఆ రోజుల్లో భూస్వాములుగా పరిగణించేవారని చెప్పారు. జిన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి ఏకంగా లక్ష ఎకరాల భూమి ఉందని, కడవెండి ప్రాంతంలో జనగామ తాలూకాలో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి భూమి 45000 ఎకరాలు ఉందని చెప్పారు. అప్పటికి తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ లేదని, ప్రజలు కేవలం కౌలు రైతులు గానే ఉండేవారని పేర్కొన్నారు. ఎవరైనా పండించుకుంటే.. జొన్నలు, కందులు మొక్కలు, ఆముదాలో పండించుకోవాల్సిన పరిస్థితి లేదని, వ్యవసాయంలో కూడా సంపద రైతాంగానికి దక్కలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచింది రైతు సంఘం అని చెప్పారు.