31-08-2025 12:19:44 AM
-ఆరేళ్ల మద్దిరాల కేతనరెడ్డి అద్భుత ప్రదర్శనలు
-అనేక విజయాలు, అవార్డులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్‌లోని ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకోనియాలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరేళ్ల చిన్నారి మద్దిరాల కేతనరెడ్డి సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శనలు ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నది. కేతనరెడ్డి వయస్సు ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపిస్తున్నది. 2023 నుండి 2025 వరకు తన కూచిపూడి ప్రదర్శనలకు విస్తృత ప్రశంసలు అందుకుంది.
కేవలం 6 సంవత్సరాల 4 నెలల వయస్సులో ఆమె ప్రతిష్టాత్మక వేదికపై ప్రదర్శన ఇచ్చింది. జనవరి 12, 2023న విజయవాడలో జరిగిన సంక్రాంతి సంబరాలు వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా సత్కారం అందుకున్నది. 2023 నుంచి ఇప్పటి వరకు అనేక విజయాలు సాధించింది. ‘లాస్య సుందరి’ టైటిల్ నాట్యాంజలి నృత్యాలయం, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ వారిచే అందుకున్నది.
‘జాతీయ పురస్కారం’ తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ (తెలంగాణ సంస్కృతీ సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనుబంధం) ఆధ్వర్యంలో అందుకున్నది. ‘నాట్య కళాశ్రీ ప్రతిభా అవార్డు’ (2024) ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెంలోని సిరిమువ్వ సోషల్ సర్వీస్ అండ్ ఆరట్స్ అకాడమీ ద్వారా ప్రదానం చేయబడింది. రికార్డ్ హోల్డర్ - తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను నవంబర్ 1, 2024న గుర్తించబడింది. రికార్డ్ హోల్డర్ - ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌గా డిసెంబర్ 21, 2024న గుర్తించబడింది.