01-09-2025 03:25:56 PM
టీపీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతోనే ఉందని కానీ బిజెపి పార్టీ దానిని వ్యతిరేకిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య(TPCC Vice President Kondeti Mallaiah) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ 33 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురాగా ప్రత్యేక తెలంగాణ అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు పరచకుండా బీసీలను మోసగించిందన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఇచ్చిన హామీలో భాగంగానే జనాభా ప్రాతిపదికన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ముందుకు వెళుతుంటే బిజెపి పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. గవర్నర్ ఆమోదం కోసం పంపిన నివేదికను సైతం గవర్నర్ తొక్కిపట్టారని ఆరోపించారు. అందుకే బీసీ బిల్లును పార్లమెంటుకు పంపినట్లు తెలిపారు. కానీ బిజెపి కూడా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశంలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం అనంతరం ప్రత్యేక జీవో ద్వారా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని అనుకోని సంఘటనలు ఎదురైనా పార్టీ పరంగా నైనా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. వారితోపాటు టిపిసిసి జాయింట్ సెక్రెటరీ సంధ్యారెడ్డి స్థానిక నేతలు ఉన్నారు.