calender_icon.png 16 July, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో యుద్ధనౌకను రంగంలోకి దింపిన చైనా

11-05-2024 12:05:00 AM

అమెరికాకు దీటుగా ‘ఫ్యూజియన్’ తయారీ

భారత్‌కు పొంచి ఉన్న ప్రమాదం

చైనా, మే 10 (విజయక్రాంతి) : డ్రాగెన్ కంట్రీ చైనా తన నౌకా దళాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా దళ శక్తిగా ఉన్న చైనా.. తన బలాన్ని మరింత పెంచుకునే క్రమంలో మూడో విమాన వాహన యుద్ధనౌక ‘ఫ్యూజియన్’ను రంగంలోకి దించింది. అమెరికాకు దీటుగా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌తో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. మే1న ఫ్యూజియన్ సీ ట్రయల్స్‌ను ప్రారంభించిన చైనా.. తాజాగా దీనిలోని ప్రొపల్షన్, విద్యుత్ వ్యవస్థల పనితీరు, స్థిరత్వాన్ని పరీక్షించింది. దీని బరువు దాదాపు 80 వేల టన్నులు, పొడవు 1,036 అడుగులు ఉండనుంది. ఫ్యూజియన్ కన్నా ముందు చైనా వద్ద లియావోనింగ్, షాంగ్‌డాంగ్ అనే 2 విమాన వాహక యుద్ధ నౌకలున్నాయి. 

హిందూ మహా సముద్రంపై పట్టు కోసం

కాగా, గత మూడు దశాబ్దాలుగా హిందూ మహా సముద్రంపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న చైనా క్రమంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. భారతదేశ క్షిపణి పరీక్షలను అతి దగ్గర్నుంచి పరిశీలిస్తూ పక్కలో బల్లెంలా తయారైంది. భారత్‌కు దీటుగా యుద్ధనౌకలను తయారు చేస్తూ సవాలు విసురుతోంది. అయితే, ప్రస్తుతం విమాన వాహక యుద్ధనౌకల విషయంలో చైనా, భారత్ సమానంగా ఉన్నాయి. చైనా వద్ద 2 యుద్ధనౌకలు ఉండగా.. భారత్ వద్ద ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విక్రాంత్ అనే రెండు యుద్ధనౌకలున్నాయి. ఇప్పుడు చైనా భారత్‌కు దీటుగా ఈమాల్స్ సిస్టమ్‌తో తయారైన మూడో ఎయిర్‌క్రాఫ్ట్‌ను రంగంలోకి దించడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయంగానే చెప్పవచ్చు. 2035 నాటికి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌తో తయారైన 3 విమాన వాహక యుద్ధ నౌకలను అందుబాటులోకి తేవాలనేదే చైనా లక్ష్యం. అదే జరిగితే, చైనా మరింత శక్తిమంతంగా మారుతుందని, ఇది భారత్‌కు ప్రతి కూల అంశమని విశ్లేషకులు చెబుతున్నారు.