అగ్రరాజ్యానికి చైనా షాక్
- 10 కంపెనీలపై ఆంక్షలు విధింపు
- అమెరికా తీసుకుంటున్న చర్యలకు దీటుగా నిర్ణయం
బీజింగ్, జూన్ 22: అగ్రరాజ్యమైన అమెరికాకు చైనా షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన పలు కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. అమెరికా ఎగుమతుల నియంత్రణలకు ప్రతిస్పందనగా చైనా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.అమెరికాకు చెందిన 10 కంపెనీలపై ఎగుమతి నియంత్రణలు విధించిన చైనా, మరో 46 సంస్థలను ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియల నుంచి నిషేధించింది.
ఆ దేశానికి చెందిన కంపెనీలను తమ ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియల నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇతర కీలక రంగాల్లోలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలకు దీటుగా చైనా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది.అమెరికా తీసుకుం టున్న చర్యలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా ప్రకటించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం,అమెరికాకు చెందిన కొన్ని రక్షణ రంగ సంస్థలు, డ్రోన్ తయారీ కంపెనీలు,ఇతర సంస్థలకు ద్వంద్వ వినియోగ (డ్యూయల్-యూజ్) ఉత్పత్తుల ఎగుమతిని నిలిపివేశారు. ఈ జాబితాలో అవియాక్స్,రెడ్ క్యాట్ హోల్డింగ్స్ , టీయల్ డ్రోన్స్, జయా రోబోటిక్స్ వంటి సంస్థలు ఉన్నాయి.
పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే సాంకేతికతలు, పదా ర్థాలు, ఉత్పత్తులను ఈ కంపెనీలకు సరఫరా చేయడాన్ని చైనా నిషేధించింది. కాగా ఈ సంవత్సరం మే నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించిన సంగతి విదితమే. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన ట్రంప్.. ఇరుదేశాల మధ్య పరస్పర వాణిజ్య సహకారంపై అంగీకారానికి వచ్చారు. అయితే నెల తిరక్కుండానే బీజింగ్ కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించడం గమనార్హం. దీంతో చైనా కూడా ప్రతి చర్యలు చేపట్టింది.






