calender_icon.png 26 August, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్, మోదీ మధ్య లోపాయికారి ఒప్పందం

26-08-2025 01:37:31 AM

  1. అందుకే ఒకరిపై ఒకరు విమర్శలుండవ్..
  2. అధ్వానంగా 20 నెలల కాంగ్రెస్ పాలన 
  3. ప్రజలు ‘స్థానిక’ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
  5. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం
  6. బీజేపీ నుంచి పలువురు గులాబీ గూటికి..

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తున్నదని, అం దుకే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బడా భాయి (మోదీ), ఛోటా భాయి (రేవంత్‌రెడ్డి) మిలాఖత్ అయి రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. బీజేపీ సీనియర్ నాయకురాలు అలూరి విజయభారతితోపాటు పలువురు నేతలు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. గతంలో మా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించేందుకు సీఎం తాపత్రయ పడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన సీఎం, గతంలో కేసీఆర్ పునాది వేసిన భవనాలను ప్రారంభించి వచ్చారని వెల్లడించారు. సీఎం మతిలేని మాటలను విని, ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రులతో పోల్చి చూసి, రేవంత్‌రెడ్డిన బండబూతులు తిడుతున్నారని వివరించారు.

సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీ మధ్య ఒక పోలిక కామన్‌గా ఉందని, అదే హామీలను ఇచ్చి మరచిపోవడమని చురకలంటించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే, ఆయన రేపోమాపో ప్రధాని మోదీతో కలిసిపోవడం ఖాయం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి పెద్ద దెబ్బతగలబోతున్నది’ అంటూ జోస్యం చోప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా కాంగ్రెస్, బీజేపీలు చెరి ఎనిమిది ఎంపీ స్థానాలను పంచుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు హామీలను బీజేపీ ఒక్కసారైనా ప్రశ్నించిన పాపాన పోలేదని నిప్పులు చెరిగారు.

అమృత్ స్కాం, హెచ్‌సీయూ భూముల స్కాంలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీనైనా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ‘గోదావరి జలాలను దిగువకు పంపి ఏపీ సీఎం చంద్రబాబు కడుతు న్న బనకచర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు తరలించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ కుట్ర జరుగుతున్నది’ అని ఆరోపించారు.

అందుకే సీఎం రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పగపట్టారని ఆరోపించారు. రాష్ట్ర రైతులను యూరియా కొరత వేధిస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తాపీగా సినిమా వాళ్లతో ముచ్చట్లు పెడుతున్నారని దుయ్యబట్టారు. 20 నెలల కాంగ్రెస్ పాలన నచ్చకుంటే, రాష్ట్ర ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

‘యూరియా కొరతకు ‘ఆపరేషన్ సిందూర్’ కారణమని బీజేపీ ఎంపీలు చెబుతున్నారని, అందుకే చైనా నుంచి ఎరువులు రాలేదని చెప్పుకొంటూ తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు ద్రోహం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.