calender_icon.png 26 August, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో ఓయూ

26-08-2025 01:44:49 AM

* ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం. పూర్వవైభవం తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం. వర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలి. సైద్ధాంతికపరమైన భిన్నాభిప్రాయాలపై చర్చలు జరగాలి. 

 సీఎం రేవంత్ రెడ్డి

వెయ్యి కోట్లు ఇస్తా

డిసెంబర్‌లో మళ్లీ వస్తా.. ఆ రోజు క్యాంపస్‌లో ఒక్క పోలీస్ కూడా ఉండొద్దు!

మానవ మృగాలు ఫామ్‌హౌస్‌లో ఉన్నాయి.. ముందు వాటిని బంధించాలి

  1. తలరాతలు మార్చేది చదువే.. 
  2. మరో ఆరు నెలల్లో 40 వేల ఉద్యోగాలు భర్తీ 
  3. ఓయూ ఠాగూర్ ఆడిటోరియం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి) : తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యంగా, ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచి న ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓయూను స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను మించి తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, దీని కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఓయూ క్యాంపస్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఓయూ సమగ్ర అభివృద్ధికి బ్లూప్రింట్ సిద్ధం చేయాలని, దీని కోసం ఇంజనీరింగ్, విద్యా రంగ నిపుణులతో ఒక కమిటీని నియమించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాను ఆదేశించారు. ‘విద్యారంగానికి ఈ ఏడాది రూ. 40 వేల కోట్లు కేటాయించాం. అలాంటిది ఓయూ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు’, అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికే తాను వచ్చానని, అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన విద్యార్థులకు హితవు పలికారు. ‘నేను డిసెంబర్‌లో మళ్లీ ఓయూకు వస్తా. ఈసారి ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టుకుందాం.

ఆ రోజు క్యాంపస్‌లో ఒక్క పోలీస్ కూడా ఉండకూడదు. నన్ను అడ్డుకునే విద్యార్థులకు నేనే సమాధానం చెబుతా. నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంది, కానీ అది అభివృద్ధిని అడ్డుకునేలా ఉండకూడదు’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  అదేరోజు అక్కడికక్కడే విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఓయూ అభివృద్ధి పనులకు జీవోలు ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మన బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో గంగ లో కలిశాయని అన్నారు.

విద్య కోసం తమ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడదని చెప్పారు. తమ ప్రభుత్వం రూ. 25వేల కోట్లతో రాష్ర్టవ్యాప్తంగా యంగ్ ఇం డియా స్కూళ్లను నిర్మిస్తోందని తెలిపారు. సీఎం తన పర్యటనలో విద్యార్థినీ విద్యార్థుల కోసం నిర్మించతలపెట్టిన నూతన హాస్టల్ భ వనాలు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ ని ర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే, 90 కోట్లతో కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలను ప్రారంభించారు. 

తలరాతలు మార్చేది చదువే..

ప్రస్తుతం పంచడానికి భూములు లేవని, ఖజానా ఖాళీగా ఉందని, ఇలాంటి పరిస్థితు ల్లో బడుగు, బలహీనవర్గాల తలరాత లను మార్చేది నాణ్యమైన విద్య మాత్రమేనని సీఎం అన్నారు. విద్యార్థులు గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టిపెట్టాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో ఆరు నెలల్లో ఇంకో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, రెండున్నరేళ్లలో లక్ష ఉద్యో గాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేటు రంగంలోనూ 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

కొం దరు ముసుగేసుకున్న చెదల్లా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, వారి మాటలు నమ్మవద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. యువత శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్ల వయ పరిమితిని 21 సంవత్సరాలకు ఎందుకుతగ్గించకూడదో ఆలోచన చేయాలి. యూనివర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలి. సైద్ధాంతికపరమైన భిన్నాభిప్రాయాలపై చర్చలు జరగాలి. సాంకేతిక పరమైన చర్చలు జరగాలి. అపోహ లకు లోను కావద్దు. అనుమానాలు ఉంటే నివృతి చేస్తాం. అబద్దాలను నమ్మకండి. ఇప్పుడు ప్రతిదానికి అడ్డుపడుతున్న వారు, తెలంగాణ సమాజానికి ముసుగేసుకున్న చెదల్లాంటి వారు.

ఉస్మానియా వర్సిటీని ఉంచకూడదని, ఎవరూ చదువుకోవద్దని వారు కోరుకునే వారు. 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మీరంతా చదువుకోవాలి. చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదు’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, పలువురు ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్లు పాల్గొన్నారు. 

ఓయూ అంటే తెలంగాణ.. 

ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం అని సీఎం అభివర్ణించారు. ఎందరో మహానుభావులను అందించిన ఘనత ఈ వర్సిటీదని గుర్తు చేశారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి నుంచి ఎంతో మంది అమరుల య్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో ఓయూను కాలగర్భంలో కలిపేసేందుకు కుట్ర జరిగిందని, దాన్ని బద్దలు కొట్టి పూర్వవైభవం తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 108 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక దళితుడైన ప్రొఫెసర్ కుమార్ మొలుగరంను వీసీగా నియమించి సామాజిక న్యాయం పాటించామని గుర్తుచేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ఏనుగులు, సింహాలు ఉన్నాయంటూ ఏఐ టెక్నాలజీతో వీడియో క్రియేట్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

15 రోజుల్లో కోదండరామ్‌కు మళ్లీ ఎమ్మెల్సీ

తమ ప్రభుత్వం ఎంతో గౌరవంగా ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే, బీఆర్‌ఎస్ నేతలు సుప్రీం కోర్టు వరకు వెళ్లి, కోట్లు ఖర్చుపెట్టి ఆయన పదవిని తీయించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మీకెందుకు అంత శునకానందం.. అంటూ బీఆర్‌ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. అయితే, కేవలం 15 రోజుల్లోనే కోదండరామ్‌ను మళ్లీ ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపిస్తామని, ఇది తన బాధ్యత అని ఆయన తేల్చిచెప్పారు.