calender_icon.png 26 August, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరుమడ్లలో కాకతీయుల తొలి దేవాలయం

14-08-2024 02:30:00 AM

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రాచీన గ్రామం ఉరుమడ్ల. ఉరుమడ్ల పేరుతో తెలంగాణా చాలా గ్రామాలున్నాయి. ఈ ఉరుమడ్లలో రెండు దేవాలయాలున్నాయి. ఒకటి శివాలయం. రెండవది రామాలయం.  శివాలయం నిర్మాణవాస్తుశైలిని బట్టి చాళుక్యానంతర తొలికాకతీయుల కాలంనాటి దేవాలయమనిపిస్తుంది. శివాలయం అంతరాళ ద్వారబంధంమీది పతంగంపైన(ఉత్తరాశి) లలాటబింబంగా గజలక్ష్మి అర్ధశిల్పం వుంది. ద్వారబంధం శేరెలమీద రెండువైపుల ఇద్దరు శైవద్వారపాలకులున్నారు.

దేవాలయాన్ని పునరుద్ధరణ చేసినట్లున్నారు. పాతగోడలు లేవు. లోపల చాళుక్యశైలి పానవట్టంమీద శివలింగం ఉంది. మంటపస్తంభాలు కాకతీయశైలివి. దేవాలయప్రాంగణంలో వినాయకుడితో కూడిన సప్తమాతృకల ఫలకంమీద 4గురు మాతృదేవతలున్నారు. త్రినేత్రుడైన శివుని శిల్పం శిరస్సు వుంది. దేవాలయపుగోడమీద రెండుచేతుల చాముండి ఖడ్గం, రక్తపాత్రతో కనిపిస్తున్నది. ఈ శిల్పం చాలా పాతది. తాంత్రికమూర్తి. ఈ దేవాలయపు చరిత్ర తెలుసుకోవడానికి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. శాసనాలేవీ లభించలేదు.

రామాలయంలోని సీతారామ,లక్ష్మణుల శిల్పాలు ప్రత్యేకమైనవి. సీతారాముల శిల్పం భద్రాచలంలోని సీతారాముల విగ్రహంతో పోల్చదగినది. శైలి భిన్నమైనది. ఇక్కడ కూడా సీతను వామాంకం మీద కూర్చొబెట్టుకుని ఉన్న రాముడు కుడిచేత బాణం ఎడమచేత విల్లు ధరించి కూర్చొని వున్నాడు. వెనక కుడిచేతిలో చక్రం, ఎడమచేతిలో శంఖాలున్నాయి. వైష్ణవమూర్తియైన ఈ రాముడు కూడా రామనారాయణుడే. లక్ష్మణ శిల్పం విడిగా రామునికి కుడిపక్కన పెట్టివుంది.

దేవాలయ ప్రాంగణంలో కనిపించిన మరొక శిల్పం లక్ష్మీనారాయణునిది. లక్ష్మిని వామాంకం మీద కూర్చొబెట్టుకుని ఎడమచేత ఆమెను పొదివి పట్టుకుని కూర్చున్న నారాయణుడు ఆసనస్థితిలో ఉన్న చతుర్భుజుడు. ముందరి కుడిచేయి అభయముద్రతో వుంది. వెనక కుడిచేయి చక్రంతో వుండాలి, కాని విరిగిపోయింది. వెనక ఎడమచేతిలో శంఖం ఉంది. శైలినిబట్టి ఈ శిల్పం 13,14వ శతాబ్దాలనాటిది. సీతారాముల శిల్పం 16వ శతాబ్దం తరువాతది.