calender_icon.png 17 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీలో పెరిగిన నిరుద్యోగం

17-11-2025 12:43:25 AM

ఏఐ నైపుణ్యాలకు మాత్రమే డిమాండ్

-తగ్గిపోయిన మాస్ రిక్రూట్‌మెంట్ 

-మధ్యతరహా కంపెనీల్లోనే ఉద్యోగాల కోతలెక్కువ

-ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌కే ప్రాధాన్యం క్రాంతి మల్లాడి

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభి వృద్ధి రేటు ఉన్నది ఐటీ రంగానికే. ఈ క్రమంలో భారతదేశంలోనూ చాలా మంది యువకులు ఐటీ ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనా విలయం ముందు వరకు ఐటీ ఉద్యోగాలు, ఉద్యోగుల జీవితాలు సాఫీగా సాగాయి. కానీ ఆ తర్వాత ఎదురైన సంక్షోభం కారణంగా ఐటీ రంగం కుదేలైంది.

దీంతో దేశంలోని ఐటీ ఉద్యోగావకాశాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. అయితే హైరింగ్ ప్లాట్ ఫారమ్ ఇన్‌స్టా హైర్ తాజా నివేదిక ప్రకా రం, నగర ప్రాంతాల్లో ఐటీ ప్రొఫెషనల్స్ నిరుద్యోగ శాతం 6.4 శాతం నుంచి 7.2 శాతం పెరిగినట్టు స్పష్టమవుతున్నది. వాస్తవానికి గత నాలుగేళ్లలో ఐటీ రం గంలో ఇదే అత్యధిక నిరుద్యోగ శాతంగా నమోదైంది. దీనికితోడు ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు సగటు చేరికలు కూడా స్తబ్దు గానే ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

అయితే మధ్యతరహా ఐటీ కంపెనీల్లో సగటు చేరికలు భారీగా పడిపోయాయి. ఉద్యోగుల తగ్గింపులు ఎక్కువగా మధ్య తరహా కంపెనీల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని తాజా నివేదిక తెలిపుతుంది. దీంతోపాటు దిగ్గజ కంపెనీల్లో కూడా 2025 సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో సగటున 5 వేల మంది చేరికలు ఉండగా, 2026 సంవత్సరంలోని రెండో త్రైమాసికానికి అది 709 మందికి పడిపోవడం గమనార్హం. 

ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌కే ప్రాధాన్యం..

ఐటీ రంగంలోని సంక్షోభం కారణంగా కంపెనీలన్నీ భారీ క్యాంపస్ రిక్రూర్‌మెంట్‌కు స్వస్తి పలుకుతున్నాయి. ఏఐ, క్లౌడ్ మైగ్రేషన్, సైబర్ సెక్యూరిటీ, జెన్ ఏఐ వంటి టెక్ రోల్స్‌కు మాత్రమే నియామకాలు చేపడుతున్నాయి. దీంతో అర్హులైన వారికి కూడా ఉద్యోగాలు లభించడం లేదు.

టీంలీజ్ డిజిటల్ అంచనాల ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(స్టెమ్) గ్రాడ్యుయేట్లు ఎంతో నష్టపోతున్నారు. స్టెమ్ గ్రా డ్యుయేట్లలో 40 శాతం ఉద్యోగాలకు అర్హులైనప్పటికీ కేవలం 15 నుంచి 20 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నా యి. ఐటీ రంగంలో హైరింగ్ మందగించడమే కారణంగానే ఈ పరిస్థితికి దారితీ స్తుంది. తద్వారా నిరుద్యోగ రేటు పెరుగుతున్నది. దీనికి తోడు నైపుణ్యం లేని ఉద్యో గులను చాలా కంపెనీలు తొలగిస్తున్నాయి.

గ్రేయహోండ్ రీసెర్చ్ ప్రకారం చాలా కంపెనీలు ఆటోమేషన్, పనితీరు రీ అలైన్‌మెంట్ కారణంగా వచ్చే కొన్ని త్రైమాసికాల్లో 50,000 ఉద్యోగాలు తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ఉన్న ఫ్రెషర్స్‌కు మాత్రం డిమాండ్ పెరుగుతున్నది. ఉద్యోగావకాశాలు తగ్గినా ఏఐ పరి జ్ఞానం, డొమైన్ నాలెడ్జ్, టెక్నాలజీ వంటి సామర్థ్యం ఉన్న ఫ్రెషర్స్‌ను నియమించడం లో కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని టెక్ నిపుణులు తెలుపుతున్నారు.

నైపుణ్యం మెరుగుపర్చుకోవడమే మార్గం..

కొత్త నియామకాలు చేపట్టడానికి కంపెనీలు వెనకాడటంలో శ్రామిక శక్తిని మెరుగుపర్చే ఒక వ్యూహం కూడా ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడు తున్నారు. అయితే ఆ దిశగా నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న కఠిన పరిస్థితుల్లోనూ ఐటీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే డిమాండ్‌లో ఉన్న కోర్సులపై నైపుణ్యం సాధించడమే సరైన మార్గమని స్పష్టమవుతున్నది.

ఉద్యోగావకాశాలు లేని పరిస్థితుల్లోనూ ఏఐ వినియోగంపై లోతైన అవగాహన, డొమైన్ పరిజ్ఞానం, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకుంటే అవకాశం కల్పించేందుకు ఐటీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ప్రస్తుతం విద్యార్థి దశ నుంచే ఏఐ, ఆటోమెషిన్, మెషీన్ లెర్నింగ్ వంటి కోర్సులపై శిక్షణ ఇవ్వడంతో ఫ్రెషర్‌లకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనుభవం ఉన్న వారు కూడా ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులపై నైపుణ్యం పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.