17-11-2025 01:58:20 AM
కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ వినతి
మేడ్చల్, నవంబర్ 16 (విజయ క్రాంతి): హైదరాబాదులో పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ విన్నవించారు. ఆదివారం నాగపూర్‌లో కేంద్ర మంత్రుని కలిసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను వివరించారు. వరంగల్ మార్గంలో ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ అనేక ఏళ్లుగా అసంపూర్తిగా ఉందని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నిజామాబాద్ మార్గంలో కొంపల్లి, మేడ్చల్ లో ఫ్లై ఓవర్ పనులు, రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయని, ఈ పనుల వల్ల తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణం నష్టం జరుగుతోందని తెలిపారు. కాంట్రాక్ట్ కంపెనీలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వివరించారు. నిర్మాణ గడువు ముగిసిందని అయినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని తెలిపారు.
బాలానగర్ నరసాపూర్ మార్గంలో ట్రాఫిక్ పెరిగినందున ఫ్లై ఓవర్లు నిర్మించాలని, నాగార్జునసాగర్ రోడ్డు నుంచి అమరావతి వరకు కొత్త హైవే నిర్మాణం చేపడుతున్నందున ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని, సాగర్ రోడ్డులో ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు పనులు వేగవంతం చేయడానికి అధికారులతో సమీక్షిస్తానని కేంద్రమంత్రి తెలిపారని ఈటెల రాజేందర్ తెలిపారు. అలాగే కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణంపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేంద్ర మంత్రుని కలిసిన వారిలో బిజెపి ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ ఉన్నారు.