calender_icon.png 17 November, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మణుల అరణ్య రోదన!

17-11-2025 12:51:13 AM

శఠగోపం పెట్టిన రాష్ట్ర సర్కారు

రెండేండ్లుగా చైర్మన్, సభ్యుల నియామకంలేని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్

-వివేకానంద విదేశీ విద్యా పథకానికి నిధులు కరువు.. రూ. కోట్ల బకాయిలు 

-నిలిచిపోయిన స్కాలర్‌షిప్పులు, ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్థిక సాయం 

-నలుగురే స్టాఫ్.. 

పనులు లేక గోళ్లు గిల్లుకుంటున్న వైనం లోకహితాన్ని కోరుకునే బ్రాహ్మణులంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చులకనభావం నెలకొందా?.. అంటే, అవుననే అంటోంది తెలంగాణ బ్రాహ్మణ సమాజం. దీనికి ప్రధాన కారణం.. తెలంగాణలో బ్రాహ్మణ వర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటుచేసి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలుచేయగా.. గడిచిన రెండేండ్లుగా నిధులులేక.. పరిషత్‌కు చైర్మన్, సభ్యులను నియమించక.. పథకాలు ముందుకు సాగక.. కొట్టుమిట్టాడుతోన్న పరిస్థితిని గమనించిన బ్రాహ్మణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

బ్రాహ్మిణ్ ఎంటర్‌ప్రెన్యూరల్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద 2023 డిసెంబర్ ఒకటి నాటికి మరో 500 మంది లబ్ధిదారుల జాబితాను ఎంపికచేసి రూ. 16 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి పంపించారు. ఆ జాబితాకు ఇప్పటి వరకు అతీగతీ లేదు. పైగా 2023 డిసెంబర్ తరువాత ఇప్పటివరకు కొత్తగా ఆర్థిక సాయం కోసం ఒక్కరినికూడా ఎంపిక చేయలేదు.

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను పూర్తిగా విస్మరించారు. బ్రాహ్మణ వర్గాలకు అండదండగా ఉన్న పలు పథకాలకు నిధులు కేటాయించకపోవడంతో అవికాస్తా పడకేశాయి. వివేకానంద విదేశీ విద్యా పథకం, బెస్ట్ పథకం లాంటివి పూర్తిగా నిలిచిపోయాయి.

వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటివరకు ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షే మ పరిషత్‌కు నియమించిన చైర్మన్, సభ్యులు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆపై ప్రభు త్వం పరిషత్‌కు కొత్త చైర్మన్, సభ్యులను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు కార్యవర్గం లేకపోవడంతో.. ఈ పరిషత్ ఆధ్వర్యంలో నడవాల్సిన బ్రాహ్మణ సదన్, అపరకర్మ భవనం లాంటివి నిర్వహణ సరిగా లేక ముందుకు సాగడం లేదు.

అలాగే వివేకానంద విదేశీ విద్యా పథకం, ఎంటర్‌ప్రెన్యూరల్ స్కీం, ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం, వేద పాఠశాలలు, పండింతులు, విద్యార్థులకు ఆర్థికసాయంకూడా నిలిచిపోయింది. నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో కార్యక్రమాలు చెల్లాచెదురయ్యాయి. పరిషత్‌కు ఉన్న నల్గురు ఉద్యోగులు పనులేమీ లేకుండా గోళ్లు గిల్లుకుంటున్నారు.

గడిచిన రెండేండ్లుగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కార్యకలాపాలన్నీ నిలిచిపోవ డంతో.. సంఘాల ప్రతినిధులు అటు సీఎంకు, ఇటు మంత్రి శ్రీధర్‌బాబు చుట్టూ తిరుగుతున్నా రు. అనేకసార్లు విన్నపాలు చేశారు. అయినా కార్యవర్గాన్ని నియమించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంతో పట్టనట్టుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం బ్రాహ్మణ వర్గాల్లోంచి వస్తోంది.

సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర ఓసీ వర్గాలను ఓటర్లుగా గుర్తించి.. వారి సంక్షేమానికి వివిధ పథకా లకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగానే బ్రాహ్మణ వర్గాలనుకూడా ఓటర్లుగా అయినా గుర్తించి.. పరిషత్‌కు నిధులు విడుదల చేసి, కార్యవర్గాన్ని నియమించాలని వారు కోరుతున్నారు.

పోరాటం చేయకతప్పదా..

గతంలో ఠంచనుగా నిధులు విడుదలయ్యేవి. కార్యవర్గం చైతన్యంతో పనులు చేసే ది. దీనితో నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు, ఔత్సాహికులకు వివిధ పథకాల కింద ఆర్థిక సాయం అందేది. కానీ గడిచిన రెండేండ్లుగా నిధులు ఆగిపోవడం... కాళ్ళరిగేలా, చెప్పులు అరిగేలా ప్రభుత్వం... ప్రభుత్వంలోని పెద్దల చుట్టూ తిరుగుతున్నా.. కనికరం చూపడం లేదని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక వర్గాలు, ఉద్యోగులు, సంస్థలవారు తమ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. నిరసనలు, ధర్నాలు, ముట్టడి చేస్తున్నారు.

ఇలాగే తాముకూడా పోరాటం చేయాలా.. అలా చేస్తేనే ప్రభుత్వానికి చురు క్కుమంటుందా అని బ్రాహ్మణవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అలా చేస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందా.. ఇదేం పరిపాలన అంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా తమ ఆశలు, అభివృద్ధి, సంక్షేమానికి తోడ్పా టు అందించాల్సిన ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవమరించడంతో.. బ్రాహ్మణులమైన తమకే సర్కారు శఠగోపం పెట్టిందంటూ వాపోతున్నారు.

వివిధ పథకాలు.. వాటి పరిస్థితి.. 

-రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలో బ్రాహ్మణ సదనాన్ని 10 ఎకరాల స్థలంలో రూ. 13 కోట్లతో నిర్మించారు. నిరుపేద బ్రాహ్మ ణులు శుభకార్యాలు, వివాహాలు చేసు కోవడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. పూర్తిగా ఉచితంగా అందిస్తారు. బ్రాహ్మణేతరులకు స్వల్ప రుసుముతో దీనిని అద్దెకు ఇస్తారు. ఇలా స్వల్పంగా ఆదాయంకూడా అందుతోంది. అయితే దీని నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు రూ. 1 కోటి మాత్రమే ప్రభుత్వం నుంచి విడుదల చేశారు.

గడిచిన రెండేండ్లుగా ఒక్క పైసా విడుదల కాలేదు. దీనికి రావాల్సిన రూ. 12 కోట్ల నిధుల కోసం కాంట్రాక్టరు కాళ్లరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. అలాగే సూర్యాపేటలోనూ బ్రాహ్మణ సదనాన్ని నిర్మిం చారు. నిధులు లేవు.. నిరుపయోగంగా మారి ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాగే ఖమ్మంలో అపరకర్మ భవనం రూ. 75 లక్షలతో నిర్మించారు. ఇదికూడా మధ్యలో ఆగిపోయింది.

-వివేకానంద విదేశీ విద్యా పథకం కింద ఉన్నత చదువుల కోసం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి అనేక దేశాలకు వెళ్లేవారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. సెమిస్టర్‌వారీగా, వారి వీలునుబట్టి విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు ఫీజులు చెల్లించి, రసీదును అందిస్తే.. ఆ మొత్తాన్ని విడుదల చేస్తారు.

2023 డిసెంబర్ వరకు 780 మంది బ్రాహ్మణ విద్యార్థులకు రూ. 81 కోట్లు ప్రభుత్వం విడుదల చేసి ఆర్థిక సాయం అందించింది. అటు తరువాత 300 మంది విద్యార్థులను ఎంపికచేసి రూ. 30 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పైగా ఈ 300 మంది విద్యార్థులు విదేశాల్లో చదవడానికి వెళ్ళిపోయారు. కానీ ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు. నానా ఇబ్బందులుపడి వారి తల్లిదండ్రులు కొంతమేరకు ఫీజులను చెల్లించారు.

ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. దీనికితోడు గతంలోనే విదేశాల్లో చదువులకు వెళ్లినవారికికూడా కొంతమేర ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ మొత్తం కలుపుకుని సుమారు రూ. 40 కోట్ల వరకు రావాలి. సీఎంకు, మంత్రి శ్రీధర్‌బాబుకు పలుమార్లు విజ్ఞప్తులు చేయడంతో 2025 సెప్టెంబర్‌లో రూ. 28 కోట్లు విడుదల చేశారు. అలాగే ఈ పథకాన్ని నడిపించాలా.. లేదా అనేది ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కొత్తగా విద్యార్థుల ఎంపికను చేపట్టలేదు.

-రామానుజ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంలో భాగం గా.. పేద బ్రాహ్మిణ్ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా 440 మందికి రూ. 1.16 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకం కూడా 2023 డిసెంబర్ తరువాత పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగా ఎవరినీ ఎంపిక చేయలేదు. వారికి స్కాలర్‌షిప్‌లు లేవు.

-వీటితోపాటు వేద పాఠశాలలకు, వేద పండితులకు, వేద విద్యార్థులకు అందించాల్సిన ఆర్థిక సాయంకూడా నిలిచిపోయింది.   

-బ్రాహ్మిణ్ ఎంటర్‌ప్రెన్యూరల్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద సుమారు 5000 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 150 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించారు. ఇందులో రూ. లక్ష వరకు ఆర్థిక సాయం పొందినవారికి 80 శాతం సబ్సిడీ, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం పొందినవారికి 70 శాతం, రూ. 2 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆర్థిక సాయం పొందినవారికి 60 శాతం సబ్సిడీ ఇచ్చారు. ఇలా ఆర్థికసాయం పొందినవారు కార్లు తీసుకుని క్యాబ్‌లుగా నడుతున్నారు. చిన్న చిన్నషాపులు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు.

వారికున్న చదువు, శిక్షణను బట్టి ఆర్థికసాయంతో దుకాణాలు, వ్యాపారాలు పెట్టుకుని జీవితాలను సాగిస్తున్నారు. అయితే 2023 డిసెంబర్ ఒకటి నాటికి మరో 500 మంది లబ్ధిదారుల జాబితాను ఎంపికచేసి రూ. 16 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి పంపించారు. ఆ జాబితాకు ఇప్పటి వరకు ప్రభుత్వం పచ్చజెండా ఊపి నిధులు విడుదల చేయలేదు. పైగా 2023 డిసెంబర్ తరువాత ఇప్పటివరకు కొత్తగా ఆర్థిక సాయం కోసం ఒక్కరినికూడా ఎంపిక చేయలేదు.

రెండేండ్లుగా మొరపెట్టుకుంటున్నాం.. 

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ 2017 ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి 2023 వరకు పరిషత్ ఆధ్వర్యంలో అనేక పథకాలను విజయవంతంగా అమలుచేశారు. వందలాది మంది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. ఆర్థిక సాయం అందుతోంది.

వందలాది మంది ఔత్సాహికులకు ఆర్థిక సాయం అందడంతో చిన్నచిన్న దుకాణాలు, చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ.. తమ కాళ్ళపై తాము నిలబడి బతుకు సాగిస్తున్నారు. ఈ మధ్యకాలం.. స్పష్టంగా చెప్పాలంటే.. 2023 డిసెంబర్ తరువాత పరిషత్ కార్యాలయం బోసిపోయింది. ప్రణాళిక లేదు.. పథకాలు లేవు.. నిధులు లేవు.. నిర్వహించేవారు లేరు.. కార్యవర్గం లేదు..  దీనితో అసలు సంక్షేమ పరిషత్తు ఉందా.. లేదా తెలియడం లేదు. తెలంగాణలోని బ్రాహ్మణులందరికీ ఇది అయోమయానికి గురిచేస్తోంది.

సందిగ్ధావస్తలో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజంలో భాగమైన బ్రాహ్మణుల సంక్షేమంపైకూడా దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అనేకసార్లు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలను వేడుకున్నారు. అయినా స్పందన రావడం లేదు. ఏం చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందనేదికూడా తెలియక.. బ్రాహ్మణులు తలపట్టుకుంటున్నారు. చాలా బాధాకరం. దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

 డాక్టర్ కేవీ రమణాచారి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ ఛైర్మన్