17-11-2025 12:45:42 AM
గుదిబండగా కేంద్రం నిబంధనలు.. వ్యతిరేకిస్తున్న జిన్నింగ్ మిల్లులు
పత్తి కొనుగోలు ప్రారంభమై 20 రోజులు గడిచినా 67 వేల మంది రైతుల నుంచి కేవలం 1.18 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం విధించిన కొర్రీలు పత్తి రైతులకు ప్రతిబంధకంగా శాపంగా మారాయి.పత్తి కొనుగోళ్లలో సీసీఐ తీసుకొచ్చిన నిబంధలను కొన్ని జిన్నింగ్ మిల్లులు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
భారీ వర్షాలు, తెగుళ్లతో సరైన దిగుబడి రాక దిగా లు పడిన పత్తి రైతుకు.. మరోవైపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన కొత్త నిబంధనలతో పండించిన పత్తికి గిట్టుబాటు రావడంలేదు. ప్రధానంగా 12 శాతం తేమ నిబంధనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా రు. ఇప్పటికే వర్షాలతో పత్తి తడిసిపోవడంతో తేమ శాతం అధికమైంది. 20 శాతం వరకు తేమతో ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నది.
అయినా సీసీఐ దానిని పట్టించుకోకుండా 12 శాతం తేమ మించి ఉన్న పత్తిని కొనుగోలు చేసేందుకు అంగీకరించడం లేదు. రంగుమారిన పత్తిని కూడా కొనుగోలు చేసేందుకు కూడా నిరాకరిస్తోంది. అయితే బహిరంగ మార్కెట్లో విక్రయిద్దామనుకుంటే.. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ. 8,100 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు మాత్రం రూ. 6 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు.
దానితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ, ఇప్పుడు 7 క్వింటాళ్లకే పరిమితి విధించింది. మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీసీఐ, పత్తి కొనుగోలును ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం 67 వేల మంది రైతుల నుంచి 1.18 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసింది.
ఇంకా తెరుచుకోని 69 జిన్నింగ్ మిల్లులు..
పత్తి కొనుగోళ్లలో సీసీఐ తీసుకొచ్చిన ఎల్ ఎల్ ఎల్ నిబంధనలను జిన్నింగ్ మిల్లులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధనల వల్ల కొన్ని మిల్లులకే పత్తి వస్తుందని, మిగతా వాటికి పత్తి రాకపోవడంతో అవి నష్టపోతాయని చెబుతున్నారు. అందుకు ఈ నిబంధనలను ఎత్తివేసి అన్ని మిల్లులకు పత్తిని సరఫరా చేయాలని జిన్నింగ్ మిల్లులు యజమాన్యాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 325 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయగా, ప్రస్తు తం 256 మిల్లులను ఓపెన్ చేశారు. ఇంకా 69 మిల్లులు తెరుచుకోలేదు.
అయితే మిల్లుల సామర్థ్యం, వాటి పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సీసీఐ జిన్నింగ్ మిల్లులను మూడు రకాలుగా (ఎల్ ఎల్‌బె ఎల్ విభజించింది. మొదటగా ఎల్ 1 కేటగిరిలోకి వచ్చిన మిల్లులు పత్తిని కొనుగోలు చేయాలని, ఆ తర్వాత ఎల్ 2, చివరకు ఎల్ 3 కేటగిరిలోని మిల్లులు పత్తిని కొనుగోలు చేసేలా సీసీఐ నిబంధనలను పెట్టింది. ఈ విధానం వల్ల రెండు, మూడు కేటగిరిలోని మిల్లులకు నష్టం జరగడంతో పాటు రైతకు కూడా రవాణా చార్జీలు పెరుగుతాయని చెబుతున్నారు.
లేఖలతోనే సరిపెడుతున్న రాష్ట్రం..
అయితే జిన్నింగ్ మిల్లుల సమస్యలు పరిష్కరించాలని అసోషియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 6 నుంచి మిల్లులు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని.. మిల్లుల సమస్యలను ఈ నెల 10 వరకు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి మళ్లీ బంద్ జరపాలని నిర్ణయించాయి. సమస్యలు పరిష్కరిస్తేనే మిల్లులు ఓపెన్ చేస్తామని మిల్లర్లు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖలు రాసి సరిపెట్టుకుంటున్నదని.. కేంద్ర మంత్రులు, సంబంధిత శాఖ అధికారుల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిన్నింగ్ మిల్లుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో బంద్‌కు పిలుపు నివ్వడంతో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ కార్యాలయం అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆధివారం ఫోన్‌లో మాట్లాడారు. సీసీఐ విధించిన నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించే విధంగా సీసీఐ అధికారులను ఆదేశించాలని మంత్రి తుమ్మల కోరారు.