calender_icon.png 17 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయా రైతును మళ్లీ ముంచారు!

17-11-2025 12:41:10 AM

-అమ్మిన పంట వాపస్

-పంటను తిరిగి పంపుతున్న నాఫెడ్

-ఇప్పటికే నిర్మల్ జిల్లా కుంటాలకు చేరిన రెండు లారీలు 

-అధికారులు నాణ్యత పరీక్షించి, గోదాములకు పంపినా అంగీకరించని వ్యాపారులు

-20 శాతం కోతకు సరే అంటే దించుకుంటామని పట్టు

నిర్మల్/కుంటాల, నవంబర్ 16 (విజయక్రాంతి): వ్యాపారులు సోయపంట రైతులను మరోసారి నిలువుగా ముంచారు. రెండు నెలలపాటు కంటికి రెప్పలా సోయపంటను కొనుగోలు కేంద్రంలో పోసి నాణ్యత ప్రమాణాల ప్రకారం తూకం వేసి, గోదాములకు తరలిస్తే.. సోయపంటను నిలువ చేసుకోవాల్సిన నాఫెడ్ అధికారులు ప్రభుత్వం కొన్న సోయపంట నాసిరకం అంటూ తిరిగి కొనుగోలు కేంద్రాలకు వాపాస్ పంపడం చర్చనీయాంశంగా మారింది.

అసలే ఆలస్యంగా ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు సోయ పంటను అమ్మారు. తూకం వేసి గోదాములకు తరలిస్తే ఈ పంట మాకొద్దు అంటూ వ్యాపారులు సోయ బ్యాగులను వెనక్కి పంపుతున్నారు. నిర్మల్ జిల్లాలో సుమారు లక్ష ఎకరాలు సోయపంట సాగు చేయగా ప్రభుత్వం పది రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం రూ.5,310 మద్దతు ధర నిర్ణయించగా.. ప్రైవేట్‌లో రూ.4,200 కి కొంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ధరకు అమ్మేందుకు రైతులు కొనుగోలు కూపన్ల కోసం పడరాన్ని పాట్లుపడ్డారు. కూపన్ అందిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం పరిశీలించి, నాణ్యతగా ఉందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు గుర్తించిన తర్వాతే కొన్నారు. పంటను కొనుగోలు చేసి నాఫెడ్ సంస్థకు లారీల్లో తరలించారు.

ఇలా నిర్మల్ జిల్లాలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కుంటాల, కుబీర్, తానూరు, భైంసా, ముధోల్, బాసర, సారంగాపూర్, నిర్మల్ మండలాల్లో కొనుగోలు చేసిన సోయను నాఫెడ్ గోదాములకు నిలువ ఉంచుకునేందుకు పంపారు. అక్కడ సోయా నాణ్యతగా లేదు అంటూ లారీలను తిప్పి పంపడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. నాలుగు రోజుల క్రితం కుంటాల సొసైటీకి చెందిన లారీలను గోదాముకు తరలిస్తే అక్కడి వ్యాపారులు సోయా పంట నాసిరకం అంటూ రెండు లారీలను తిరిగి పంపారు. 

వంద కిలోలకు 20 కిలోలు తగ్గిస్తేనే సరి

పంట పండించిన రైతులను అనేక విధాలుగా మోసం చేస్తున్న వ్యాపారులు ఇప్పుడు నాణ్యత పేరుతో కొనుగోలు చేసిన పంటలో కోత ఒప్పుకుంటేనే స్వీకరిస్తామంటూ మెలికలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులు తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాతనే తూకం వేస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసి గోదాములకు పంపిన తర్వాత అది నాసిరకంగా ఉన్నదంటూ వ్యాపారులు మెళిక పెడుతున్నారు.

20శాతం నష్టానికి ఒప్పుకుంటేనే కొనుగోలు చేస్తామని సొసైటీ అధికారులకు, రైతులకు సమాచారం ఇస్తున్నారు. అంటే 100 కిలోల బస్తాను 80 కిలోలకు లెక్కించి డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి, తాము చెప్పిన డిమాండ్‌కు అంగీకరిస్తేనే దించుకుంటామని లేకపోతే వాపస్ తీసుకెళ్లాలని మొండికేస్తున్నారు. దీంతో లారీలు గోదాముల వద్ద రెండు మూడు రోజుల నుంచి నిలిచిపోవడం వల్ల రవాణా చార్జీలు భారంగా మారుతున్నాయి.

ఈ చార్జీలు కూడా రైతులపైనే మోపుతున్నారు. గోదాములకు వెళ్లిన సోయపంట తిరిగి వస్తే రైతులు మళ్లీ ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లా మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి రైతులు ఈ సమస్యను తీసుకెళ్లినా వారు చేతులు ఎత్తివేయడంతో తమ పరిస్థితి ఏం కావాలని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి గోదాములకు తరలించిన సోయపంట తిరిగి రాకుండా వ్యాపారులతో సంప్రదింపులు జరిపి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.