calender_icon.png 5 August, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంటోంది!

05-08-2025 12:32:02 AM

  1. డీసీసీ చీఫ్ నర్సారెడ్డిపై వ్యతిరేకత ఉధృతం
  2. మంత్రిముందే అధికార పార్టీ ప్రొటోకాల్ రగడ
  3. నామినేటెడ్ పదవులపై నేతల ‘గాడ్ ఫాదర్స్’ రాజకీయం

సిద్దిపేట, ఆగస్టు 4(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. అధికారంలో ఉన్నప్పటికీ నేతలు, కార్యకర్తల మధ్య వర్గపోరు ఉధృతమై పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉధృతమై వర్గ రాజకీయాలు బహిర్గతమవ్వడం జిల్లా కాంగ్రెస్లో అలజడి రేపుతోంది.

ఆయనపై వ్యతిరేక వర్గం ‘గాడ్ ఫాదర్స్’ ఆశ్రయం కోసం తిరుగుతోందనే ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. నామినేటెడ్ పదవుల కోసం నేతలు రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరిగినా, జిల్లాలో ఐక్యత లేకపోవడం వల్ల పదవులు ఆగిపోవడం అసంతృప్తిని మరింత పెంచింది.

మంత్రిముందే రచ్చ!

ఆదివారం గజ్వేల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ముందే ప్రోటోకాల్ రగడ చెలరేగింది. డిసిసి అధ్యక్షుడి వర్గం బహిరంగంగానే రచ్చ చేయడంతో మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామం జిల్లాలో వర్గపోరు ఎంత లోతుకు వెళ్లిందో స్పష్టమైంది.

మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట కాంగ్రెస్ లోని వర్గ పోరును సద్దుమణిగిస్తాను అని హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. గజ్వేల్లో నర్సారెడ్డి, సిద్దిపేటలో హరికృష్ణ, దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి వర్గాలు వేర్వేరుగా ఏర్పడటం పార్టీకి పెద్ద మైనస్గా మారింది. డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి పార్టీ కార్యకర్తల, సీనియర్ నాయకులను దురుసుగా మాట్లాడతాడని  పార్టీ నాయకులు చెప్పడం వ్యతిరేకవర్గానికి కలిసొచ్చిన అంశంగా మారింది.

ఆదివారం గజ్వేల్, జగదేవపూర్ లలో జరిగిన అధికారిక కార్యక్రమాలలో పార్టీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించాడని ఆయన వ్యతిరేకవర్గం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులకు అమ్ముడుపోయాడు అంటూ మీడియా సమావేశంలో బహిరంగంగానే నర్సారెడ్డి పై విమర్శలు గుప్పించారు. గజ్వేల్ లో ఆత్మ కమిటీ చైర్మన్, తన వర్గంతో వెళ్లి నాయకులపై దుర్భాషలాగాడంటూ, ఓ నాయకుడిని కులం పేరుతో దూషించాడు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారు.

మంత్రి వివేక్‌కు సవాల్... 

జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి చురుకుగా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నపటీకి, వర్గపోరు, పార్టీ ఐక్యతకు అడ్డంకిగా మారింది. దుబ్బాక, సిద్దిపేటలలో బిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్రోటోకాల్ రగడలు జరుగుతుండగా, గజ్వేల్లో మాత్రం మైనంపల్లి వర్సెస్ నర్సారెడ్డి వర్గాల మధ్య ఘర్షణలు పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి.

ఇకనైనా నామినేటెడ్ పదవులు కేటాయించి వర్గపోరుకు చెక్ పెడతారా? లేక కాంగ్రెస్ అంతర్గత పోరు మున్ముందు ముదురుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. వివేక్ కు అందరినీ ఏకతాటిపైకి తేవడం పెద్ద సవాల్గా మారింది.