20-05-2025 05:53:37 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై క్లూస్ టీమ్ దర్యాప్తు పూర్తయింది. గుల్జార్ హౌస్ ను క్షుణ్ణంగా పరిశీలించిన క్లూస్ టీమ్ భవనంలో 14 ఏసీలు ఉన్నాయని, గోడలు బీటల వారినట్లు అధికారులు గుర్తించారు. దీంతో భవనం కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు క్లూస్ టీమ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం పేర్కొన్నారు. ఈ సంఘటనపై కమిటీ వివరణాత్మక దర్యాప్తు నిర్వహించి, సంఘటనకు ప్రధాన కారణం అగ్నిప్రమాదం తర్వాత వివిధ విభాగాలు తీసుకున్న చర్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదికను సమర్పిస్తుందని హైదరాబాద్ ఇన్‌చార్జ్, మంత్రి ప్రభాకర్ తెలిపారు. భవిష్యత్తులో స్థానిక పరిస్థితులను అంచనా వేసి, అగ్ని ప్రమాదాలను నివారించడానికి తగిన ప్రతిపాదనలతో క్షేత్ర స్థాయిలో ప్రజలకు సూచనలు చేయాలని వెల్లడించారు.
నివేదిక అందిన తర్వాత, సీఎం రేవంత్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ అధికారులు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురాశెట్టి, హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ వై.నాగి రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) ముషారఫ్ ఫరూఖీ ఉన్నారు.