31-01-2026 08:46:40 PM
చివ్వెంలలో సీఎం కప్–2025 మండల స్థాయి క్రీడోత్సవాలు ఘన విజయం
చివ్వెంల: సీఎం కప్–2025 కార్యక్రమంలో భాగంగా చివ్వెంల మండల స్థాయి క్రీడోత్సవాలను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, చివ్వెంల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడోత్సవాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ విభాగాల్లో ముందుగా పేరు నమోదు చేసుకున్న క్రీడాకారులకు ఉత్సాహభరితంగా పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని తెలిపారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ... క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, స్నేహభావం, సమిష్టితత్వం పెంపొందుతాయని అన్నారు.
యువత క్రీడలను జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు.క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నిర్వాహకులు మెడల్స్ ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్, ఎంపీఓ దయాకర్, ఎంఈఓ కళారాణి , చివ్వెంల గ్రామ సర్పంచ్ ఏర్పుల కళ్యాణి, ఉప సర్పంచ్ తుర్క మౌనిక, పీడీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు మరియు క్రీడాకారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.