calender_icon.png 31 January, 2026 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ స్మైల్ నిరంతర ప్రక్రియ

31-01-2026 08:41:45 PM

నెల రోజుల వ్యవధిలో 81 మంది బాలల రక్షణ

69 మందిని తల్లిదండ్రులకు అప్పగింపు 

12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలింపు

జిల్లా వ్యాప్తంగా 52 కేసుల నమోదు

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

మెదక్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం, నెల రోజుల వ్యవధిలో మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగిందని జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ ముగింపు సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాలలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ  ముందు హాజరుపరచడం జరిగిందన్నారు.

నెల రోజుల వ్యవధిలో మొత్తం 81 మంది బాలలను రక్షించగా, అందులో 69 మందిని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించగా, మిగిలిన 12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 కేసులు నమోదు చేయడం జరిగిందని, బాల కార్మికులను పనిలో ఉంచుకుంటున్న యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆరుగురిని పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని, ఇందులో జడ్పీహెచ్‌ఎస్ టేక్మాల్‌లో ఇద్దరు, నాగసన్‌పల్లి పాఠశాలలో ఇద్దరు, మెదక్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇద్దరు బాలలను చేర్పించడం జరిగిందని తెలిపారు.

ఈ బాలలలో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన పిల్లలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, బాలలు కార్మికులుగా మారకుండా విద్యాబాటలో నడవాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యమని జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. సిబ్బందికి ఎదురైన అనేక వత్తిడులను అధిగమించి, అన్ని శాఖల సమిష్టి కృషితో ఈ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగిందన్నారు. భవిష్యత్తులో కూడా బాల కార్మికుల నిర్మూలన దిశగా నిరంతర చర్యలు చేపడుతూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు.

మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు, మహిళలపై జరిగే అక్రమాలను నిరోధించుడానికి యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పని చేస్తుందని మెదక్ జిల్లాలో  ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేస్తుందిని ప్రజలకు ఏమైనా సమాచారం ఉంటే తెలిపాలన్నారు. ఈ సమావేశంలో AHTU ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సిడబ్లుసి ఉప్పలయ్య,లేబర్ డిపార్ట్మెంట్  నాగరాజు, ఏల్ఓ మెదక్ సత్యేంద్ర ప్రసాద్, ఏల్ఓ రామాయంపేట్ రాజు,  ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాజు, వీషన్ ఎన్‌జీవో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాజు, సిఎస్ యం ఎన్జిఓ సంజీవ్, యాదగిరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.