calender_icon.png 19 January, 2026 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో పదేళ్లు మాదే అధికారం!

19-01-2026 02:06:16 AM

2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే

సంక్షేమ పాలనను సహించని బీఆర్‌ఎస్

ప్రజల ఆశీస్సులతో బీఆర్‌ఎస్‌ను బొంద పెడతాం

భద్రాద్రిని అయోధ్యలా మారుస్తాం

ఖమ్మం జిల్లా ఏదులాపురం సభలో సీఎం రేవంత్‌రెడ్డి

ఖమ్మం, జనవరి 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో 10 ఏళ్ల వరకు అంటే 2043 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తుంటే ఓర్వలేని బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు విషం కక్కుతున్నారని, కేసీఆర్ రాక్షసుల గురువు శుక్రాచార్యుడిలా, కేటీఆర్, హరీశ్‌రావు మారీచ, సుభాహుల్ల వ్యవహరిస్తున్నారని చురకలాంటించారు. ప్రజల ఆశీస్సులు ఉంటే బీఆర్‌ఎస్‌ను 100 మీటర్ల లోతులో బొంద పెడతామని విమర్శించారు. భద్రాద్రిని అయోధ్యల మారు స్తామని అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

అనంతరం స్థానిక మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లు శాశ్వతంగా నిలిచి పోతాయని తెలిపారు. గతంలో తెలుగు వారు అంటే మద్రాసీలు  అనే పేరు ఉండేదని, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ వేదిక నుంచి వారికి నివాళులు అర్పిస్తున్నామని అన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత కరెంటుపై మొదటి సంతకం చేయడమే కాకుండా రూ. 1300 కోట్ల విద్యుత్ బకాయిలు రద్దుచేసి, వేలాది మంది రైతులపై ఉన్న కేసులను తొలగించిన మహానుభావుడు వైఎస్‌ఆర్ అని అన్నారు. ఆయన స్ఫూర్తితో నేడు 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు పేదలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ 52 లక్షల పేదల కుటుంబాలకు, 30 లక్షల పంపు సెట్ లకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట మోసం చేశారని సీఎం విమర్శించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో  4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి భద్రాచలంలో శ్రీరామ చంద్రమూర్తి సాక్షిగా ప్రవేశ పెట్టామని అన్నారు. ఏప్రిల్ నెల తర్వాత పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలకు రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు. బీఆర్‌ఎస్‌లోని ప్రధాన నాయకుడి పని అయిపోయిందని, ఆయన రాక్షసుల గురువు శుక్రాచార్యుడిలా వ్యవహరిస్తూ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారని అక్కడ ఉండి శకునిల మాయోపాయాలు చేస్తున్నారని పరోక్షంగా కేసీఆర్‌కు చురకలాంటించారు.

ఇక బావ బామ్మర్దులు అసెంబ్లీలో మారీచ శుసుభాహుల్లా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు, కేటీఆర్‌పై విమర్శలు చేశారు. భద్రాద్రి ఆలయానికి 100 కోట్లు కేటాయిస్తానని రాముల వారి అంతటి దేవుడిని మోసం చేసిన ఘనత కేసీఆర్‌ది అని, కానీ తాము అలా కాకుండా భద్రాద్రిని మరో అయోధ్యల మారుస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇదే తరహాలో కాంగ్రెస్కు విజయం కట్టబెట్టాలని అలాగే బీఫామ్ ఎవరికి దక్కితే వారికి మిగతా వారందరూ సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను కోరారు. కాంగ్రెస్లో కష్టపడి పని చేసే వారికి సమచితస్థానం ఉంటుందని, అందుకు తానే నిదర్శనమని, గతంలో ఎలాంటి మంత్రి పదవులు చేపట్టకపోయినా, పార్టీలో తనకంటే సీనియర్లు ఉన్నా, పనితనాన్ని గుర్తించి పార్టీ తనను ముఖ్యమంత్రిగా చేసిందని గుర్తు చేశారు. 

సీఎం సహకారంతో అన్ని పనులు: డిప్యూటీ సీఎం భట్టి

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అవసరమైన అన్ని పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో చేపట్టామని అన్నారు. ఇరిగేషన్ కు సంబంధించిన మున్నేరు పాలేరు లింకు, ఎడ్యుకేషన్ సంబంధించి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం, హెల్త్ కు సంబంధించి కూసుమంచిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే విధంగా జిల్లాకు పరిశ్రమల పార్కు ప్రత్యేకంగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కోరారు.

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 50 నుంచి 60 టీఎంసీల మున్నేరు నది జలాలు వృధాగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయని, ముల్కనూర్ గ్రామం వద్ద చెక్ డ్యాం నుంచి 9.6 కిలో మీటర్ల గ్రావీటి కాల్వ ద్వారా మున్నేరు పాలేరు లింక్ కేనాల్ పనులకు ప్రభుత్వం 162 కోట్లతో చేపట్టామని, ఈ ప్రాజెక్టు ద్వారా 2 మెగా వాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి, లక్షా 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు. గత పాలకుల పాలనలో సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి ఒక ఎకరం కూడా భూ సేకరణ చేయలేదని విమర్శించారు.

గోదావరి నది జలాల ద్వారా ఖమ్మం జిల్లాలో ఆరు లక్షల 80 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు వేగవంతం చేశామని అన్నారు. 4వ పంప్ హౌస్ పనులు వేగవంతం అవుతున్నాయని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతారామ ఎత్తిపోతల పథకానికి 67 టిఎంసిల నీటి కేటాయింపు చేయడం జరిగిందని అన్నారు. మున్నేరు పాలేరు నది లింక్ కేనాల్ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 120 కోట్ల విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు వాకాటి శ్రీహరి మాట్లాడుతూ అతి తక్కువఖర్చుతో లక్ష యాభై వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మున్నేరు పాలేరు లింకు పనులను ప్రజా ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించాలనేదే తన లక్ష్యమని చెప్పారు.

హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ బంగాళాఖాతంలో వృథాగా కలిసే మున్నేరు నది జలాలను 9.6 కిలో మీటర్ల మేర త్రవ్వి గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ లో కలిపేందుకు 162 కోట్లతో చేపట్టిన మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పనులకు నేడు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని, దీని ద్వారా నాగార్జున సాగర్ క్రింద ఉన్న లక్షా 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్ బాబు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొన్నారు.