calender_icon.png 19 January, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా జీవితానికి సార్థకం మేడారం

19-01-2026 01:59:38 AM

సమ్మక్క సారలమ్మ జాతరకు ఘనమైన ఏర్పాట్లు 

మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన సంతృప్తి నాది

మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

మేడారం, జనవరి 18 (విజయక్రాంతి): ప్రతి మనిషి మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు లేదంటే అతని మిత్రులు బంధువులు అతను చేసిన ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేసిండా అని వెనితిరిగి చూసుకుంటే చాలామంది జీవితాల్లో శూన్యం కనిపిస్తుందని, కానీ తన జీవితంలో మరణం అంటూ వస్తే ఆ రోజు తనకు సమ్మక్క సారలమ్మ జాతరకు ఘనమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతరులకు ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన సంతృప్తి మిగులుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్విగ్నంగా పేర్కొన్నారు. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో నిర్వహించిన క్యాబినేట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అంతకుముందు సీఎం, మంత్రులు మేడారం ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

మేడారం మహా జాతరను చారిత్రక కట్టడాలుగా నిలిచిపోయే విధంగా చేయడం అరుదైన అవకాశం అని, నమ్మిన ప్రజల కోసం కాకతీయులపై కత్తి దూసిన వీరవనితలైన సమ్మక్క సారలమ్మ దేవతలకు గొప్పగా ఏర్పాటు చేయడం తనకు జీవితకాలం సంతృప్తి నిస్తుందన్నారు. గుడిలేని తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ గిరిజన జాతర గా ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అని, తాము నమ్మిన ప్రజల కోసం కాకతీయుల పై కత్తి చూసిన వీరవనితలు సమ్మక్క సారలమ్మలని, ఆ స్ఫూర్తితోనే గత పాలకుల ప్రజా కంటక పాలనను అంతమొందించడానికి 2023 ఫిబ్రవరి 6న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుండే హత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలోనే మేడారం ప్రాంతాన్ని ప్రపంచ ప్రఖ్యాతి పొందే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఉత్తరాదిలో కుంభమేళా ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ జాతర కుంభమేళా తరహాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన గిరిజనేతర ప్రజలను ఇక్కడికి రప్పించే విధంగా చారిత్రాత్మక కట్టడాలను నిర్మించడానికి నిర్ణయించి, ఇందుకు సంబంధించిన విధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింద న్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగు నియోజకవర్గము నుండి మంత్రి సీతక్క మంత్రివర్గంలో ఉండటంతో తల్లి బిడ్డలైన సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులు ఇంత ఘనంగా రూపొందడానికి దోహదపడ్డాయని చెప్పారు. ‘ఇంతటి మహత్కార్యాన్ని 100 రోజుల్లోనే పూర్తి చేయాలంటే అధికారులు, ఆర్కిటెక్చర్లు ఆశ్చర్యపోయారు.

అయితే ఈ పనులన్నింటినీ వంద రోజుల్లో పూర్తి చేసే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించా. పనులకు ఆటంకం లేకుండా వంద రోజుల్లో, జనవరి 28 2026 జాతర నాటికి మేడారం పునరుద్ధరణ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పనులు పూర్తి చేయాలని కోరాను. ఆ మేరకు కొన్ని నిష్ఠురాలు ఎదురైనా మంత్రి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి పనులను పూర్తి చేయించడానికి కృషి చేశారు’ అని సీఎం చెప్పారు. మేడారం జాతరకు నిరంతరం వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు నిర్వహిస్తామని తెలిపారు. జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించే విధంగా నీటికి కొరత లేకుండా రామప్ప చెరువు నుండి లక్నవరం ద్వారా మేడారం జంపన్న వాగు పైప్ లైన్ వేసి నిరంతరం నీళ్లు వాగులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కుంభమేళా తరహాలో మేడారం చేసి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.