08-05-2025 06:42:44 PM
హైదరాబాద్: నగరంలోని బుద్దభవన్ లో గురువారం హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra Police Station) భవనాన్ని, హైడ్రా కోసం సమకూర్చిన యంత్రాలు, వాహనాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన పూర్వీకులు మనకు ఇచ్చినా చెరువులను కాపాడుకోవాలని సూచించారు. చెరువులు కనుమరుగైతే మనకు మనుగడ ఉండదని, 450 ఏళ్ల చరిత్ర ఉన్న నగరాన్ని కాపాడుకునేందుకు హైడ్రా ఉపయోగపడుతుందన్నారు. 76 ఏళ్లలో రాజ్యాంగాన్ని 100 సార్లకు పైగా సవరించుకున్నామని, మంచి పరిపాలన అందించేందుకే రాజ్యాంగాన్ని అన్నిసార్లు సవరించుకున్నామని సీఎం తెలిపారు.
నగరాభివృద్ధి కోసం గత ముఖ్యమంత్రులు ఎన్నో చట్టాలు చేశారని, 1908లో హైదరాబాద్ లో వచ్చిన వరదలు చూసి అప్పటి నిజాం(Nizam) కన్నీరు పెట్టుకున్నారన్నారు. కన్నీరు పెట్టుకున్న నిజాం.. 'హైదరాబాద్ కు మళ్లీ అలాంటి పరిస్థితి రావొద్దని భావించారు', గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య(Engineer Mokshagundam Visvesvaraya)ను పిలిపించి హైదరాబాద్ లో మూసీపై డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారని సీఎం పేర్కొన్నారు. పాతబస్తీ అంటే.. వెనుకబడిన ప్రాంతంగా పేరు స్థిరపడిపోయిందని, ఓల్డ్ సిటీ అంటే.. ఒరిజినల్ సిటీ అని భావించి అభివృద్ది చేయాలని నిర్ణయించామని అన్నారు. బెంగళూరులో గత ఏడాది వేసవిలో నీటికరువు వచ్చిందని, చెన్నై, ముంబాయి వంటి నగరాల్లో వరదలు వస్తే 2, 3 భవనాలు మునిగిపోతున్నాయని తెలిపారు.
దేశ రాజధాని దిల్లీ(New Delhi)లో కాలుష్యం పెరిగిపోయి జీవించలేని పరిస్థితి అని, హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రానీయొద్దని భావించామని సీఎం రేవంత్ అన్నారు. హైడ్రా అంటే.. ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారన్నారు. మెట్రో పాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు ఉన్నయని, హైడ్రా అంటే ప్రభుత్వ, ప్రజల ఆస్తులు రక్షించేది అని తెలిపారు. చిన్న వర్షం వస్తే నగరంలో కాలనీలు మునిగిపోతున్నాయని, పేదల కాలనీలకు వెళ్లే దారులను పెద్దలు ఆక్రమిస్తున్నారన్నారు. నాలాల ఆక్రమణ వల్లే చెరువుల్లోకి వెళ్లాల్సిన నీరు రోడ్లపై నిలుస్తోందన్నారు. వర్షం వస్తే రోడ్లపై కూలిన చెట్లను హైడ్రా నిమిషాల్లోనే తొలగిస్తుందని, కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, కాలనీల రోడ్లను హైడ్రా రక్షిస్తోందని సీఎం పేర్కొన్నారు. లేక్ వ్యూ(Lake view) మోహంతో చెరువుల పక్కన ఫామ్ హౌస్ లు, గెస్ట్ హౌస్ లు నిర్మించుకున్నారన్నారు.
ఫామ్ హౌస్ లు, గెస్ట్ హౌస్ ల నుంచి వ్యర్థాలు, నీటిని చెరువుల్లోకి వదులుతున్నారని.. చెరువులు, నాలాలు ఆక్రమించిన వారికే హైడ్రా అంటే భయం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మూసీని ప్రక్షాళన చేసి నగర వాసులకు మంచి జీవితం ఇవ్వాలని భావించామన్నారు. బీజేపీ ప్రభుత్వం(BJP Govt) గంగానది, యమునా నదిని ప్రక్షాళన చేయటం లేదా..?, నదుల ప్రక్షాళనను బీజేపీ చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా..? మోదీ, యోగి చేస్తే ఒప్పు.. తెలంగాణ ప్రజలు చేస్తే తప్పా..? అని మండిపడ్డారు. మూసీలో ఆక్రమణలు తొలగిస్తే.. రియల్ ఎస్టేట్ పడిపోతుందని దుష్ప్రచారం చేశారని, కంచె గచ్చిబౌలి భూముల్లో అభివృద్ది పనులు చేపడితే దాన్ని కూడా అడ్డుకున్నారని సీఎం చెప్పారు. వరద నీళ్లు ప్రవహించాల్సిన నాలాలపై ఇళ్లు, అపార్టుమెంట్లు వెలిశాయని అన్నారు.
ఐఎంజీ భారత్(IMG Bharat) అనే సంస్థ చేతిలో ఉన్న 400 ఎకరాల భూములను తాము కాపాడమని, 400 ఎకరాలు ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) పదేళ్ల పాటు పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో పోరాడి 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని, 400 ఎకరాల్లో కంపెనీలు నిర్మిస్తే.. లక్ష ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. నగరం అభివృద్ది కాకుండా, కొత్త ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు.