08-05-2025 07:15:12 PM
రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి..
భద్రాచలం (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికి పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ఉగాది నుండి ప్రారంభించడం జరిగిందని తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. భద్రాచలం పట్టణంలోని అయ్యప్ప కాలనీలో ఎస్సీ మాల కులమునకు చెందిన పిట్టల లక్ష్మీకాంతం, బాబురావు కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో తయారుచేసిన వంటకాలను ఆయన చవిచూశారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తమ గృహానికి భోజనం చేయడానికి రాగానే కుటుంబంలోని సభ్యుల ఆనందానికి అవధులు లేవు. మంత్రివర్యులు వారు మనస్ఫూర్తిగా సన్నబియ్యంతో వండిన ఆహారం, రుచికరమైన కూరలు తయారుచేసి వడ్డించిన ఆహారాన్ని తృప్తిగా భోజనం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం దేశానికే ఆదర్శమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందని అన్నారు.
ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు ఈ సన్నబియ్యం పథకం ఎంతో ఉపయోగపడుతుందని, మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ కంపెనీ పథకం, వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలు వివిధ నూతన వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు చాలా పేదరికంతో కాలం గడుపుతున్నామని ఉండడానికి సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నామని మంత్రి దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఆర్డీవో దామోదర్ రావు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.