8 March, 2026 | 2:17 PM

ప్రజాభవన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

08-03-2026 12:41 PM

హైదరాబాద్‌: జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌లో ఐ అండ్ పిఆర్ విభాగం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని, దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ఉక్కు మహిళ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం పేర్కొన్నారు.

ఎక్కడ అవకాశం ఉన్నా ఉన్నతపదవులకు మహిళలను నియమిస్తున్నామని, అంతేకాకుండా హైదరాబాద్ కలెక్టర్ గా మహిళ బాధ్యత వహిస్తున్నారమని, ఎస్ఐబీ అధిపతిగా మహిళను పెట్టామని ఆయన తెలిపారు. వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని, వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే వారిగా స్వయం సహాయక బృందాలను తయారు చేశామన్నారు. తెలగాణ మహళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్ లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని గుర్తు చేశారు.

మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని సీఎం వెల్లడించారు. దేశంలో మహిళ శ్రమకు గుర్తింపు లేదని, దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందన్నారు. అమెరికాలో కూడా వివక్ష ఉంది.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందని, ఇక్కడ మాత్రం కష్టపడేవారికి గుర్తింపు ఉండదని చెప్పారు. మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రణాళికలను తయారు చేశామన్నారు.

హైదరాబాద్ ను పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చాలని,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని అభవృద్ది చేశారని గుర్తు చేశారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామని, నగరంలోని 100 శాతం ఈవీ బస్సులను తెస్తున్నామని, ఇక్కడ ఉన్న డీజిల్ బస్సులను 2026 డిసెంబర్ లోపు జిల్లాలకు తరలించి ఏసీ ఈవీ బస్సులు తెస్తామని హామీ ఇచ్చారు.  ఈవీ వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్స్ ఇస్తామని, కళాశాలకు వెళ్లి విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.