16-01-2026 05:08:17 PM
నిర్మల్ ప్రజల వల్లే సీఎం అయ్యా
ప్రధానిని కలవకపోతే నిధులు, ప్రాజెక్టులు ఎలా వస్తాయి?
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరాలు కురిపించారు. నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే సీఎం అయ్యానని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నిర్మల్ కే వచ్చానని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి బహిరంగసభ పెట్టామని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా పోరాటానికి, పౌరుషానికి నెలవైన గడ్డ అన్నారు. జల్, జంగల్, జమీన్ అంటూ కుమురంభీ కొట్లాడారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు ఇస్తామని చెప్పారు. పారిశ్రామికంగానూ ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు. కేసీఆర్ అనుకుంటే పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధి చెందేదని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేదని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాకు వర్సిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ వస్తుందని హామీ ఇచ్చారు. బాసర ఐఐటీలోనే యూనివర్సిటీని ప్రారంభిస్తామని తెలిపారు. బాసర ఐఐటీలోనే యూనివర్సిటీ ఏర్పాటుకు ఏర్పాట్లు చేయాలనిమంత్రి జూపల్లి కృష్ణారావుని కోరారు. నిర్మల్ జిల్లా సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించాలని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించాలని మంత్రి జూపల్లికి సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ పోర్టు..
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాల్సిందే.. ఆదిలాబాద్ జిల్లాకు నీరు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ పోర్టు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎర్రబస్సు రాని చోటుకు ఎయిర్ బస్ను తీసుకొస్తాం.. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిద్దామన్నారు. ఎయిర్ పోర్టు కోసం 10 వేల ఎకరాల భూమి సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత అభివృద్ధే అందరి లక్ష్యమని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధాని వద్దకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు తేవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి, నిధుల కోసం ఎవరినైనా కలవడానికి తాను ఆలోచించని చెప్పారు. ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం.. అడగాల్సిన ప్రాజెక్టులు అడిగామన్నారు. పదేళ్లపాట కేంద్రప్రభుత్వాన్ని గత ప్రభుత్వం అడగలేదని విమర్శించారు. అడగకపోతే రాష్ట్రానికి ఏం కావాలోకేంద్రానికి ఎలా తెలుస్తోందని సీఎం ప్రశ్నించారు.
గత పాలకుల అప్పులు ఉరితాడై.. ఊపిరి తీస్తుంది..
గత పాలకులు చేసిన అప్పులు ఉరితాడై.. ప్రభుత్వం ఊపిరి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని పదే పదే కలుస్తున్నానని కొంతమంది వివర్శిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ఎవరు ఇస్తారు.. ప్రధాని కాదా? అని ప్రశ్నించారు. ప్రధానిని కలవకపోతే నిధులు, ప్రాజెక్టులు ఎలా వస్తాయన్నారు. నిర్మల్ జిల్లాకు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. నాగోబా జాతరకు రూ. 22 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ. 300 కోట్లు కేటాయించి పునర్నిర్మాణం చేశామని వివరించారు. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని తెలిపారు. పెట్టుబడుల కోసం తాము ప్రయత్నిస్తున్నామని, స్థిరాస్థి వ్యాపారం చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వస్తున్న వార్తలను రేవంత్ ఖండించారు. పదేళ్లు అధికారాన్ని అనుభవించి.. రూ. 8 లక్షల కోట్లు అప్పు చేశారు.. రూ. వేల కోట్లు దోపిడీ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.