11-10-2025 05:15:23 PM
హైదరాబాద్: హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) వై పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2001 బ్యాచ్ అధికారి, 52 ఏళ్ల పురాణ్ కుమార్ అక్టోబర్ 7, 2025న చండీఘర్‌లోని సెక్టర్ 11 నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అణగారిన వర్గాలపై జరుగుతున్న దారుణాలను తీవ్రంగా ఖండిస్తూ అని, ఐపీఎస్ అధికారిని బలవంతంగా చంపడం కులం పేరుతో జరుగుతున్న దాడులకు ఒక స్పష్టమైన ఉదాహరణ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఏడీజీపీ స్థాయి అధికారిని కులం పేరుతో వేధించడం చూస్తే సామాన్యుల జీవన పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని సీఎం మండిపడ్డారు. ఇలాంటి అసహనకర సంఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల పట్ల ద్వేషం సమాజాన్ని విషపూరితం చేస్తుందని హెచ్చరించారు. ఈ రకమైన అవమానకరమైన సంఘటనలు ప్రజలను రాజ్యాంగం, సమానత్వం, న్యాయం పట్ల విశ్వాసం కోల్పోయేలా చేస్తాయని, అణగారిన వర్గాలపై జరిగే ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఇది ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ పై జరిగిన దాడి మాత్రమే కాదు, మొత్తం దేశం కూడా, దీనిని ప్రజలు తీవ్రమైన సమస్యగా పరిగణించాలని ఆయన కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాధారణ పౌరుడైనా, ఉన్నత పదవిలో ఉన్నా, దళిత వర్గానికి చెందినా, హోదాతో సంబంధం లేకుండా అన్యాయం, అమానవీయతను సహించకూడదని సీఎం స్పష్టం చేశారు.