calender_icon.png 12 October, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయల్లో అన్యమతస్తులను అరికట్టాలి

11-10-2025 08:28:21 PM

భాజపా ఆధ్వర్యంలో ఈఓకు వినతి పత్రం..

పాపన్నపేట (విజయక్రాంతి): ఏడుపాయల్లో అన్యమతస్తులను అరికట్టాలని కోరుతూ శనివారం భారతీయ జనతా పార్టీ నాయకులు దేవస్థానం ఈఓకు మెమోరండం అందజేశారు. అదేవిధంగా ఇటీవల ఏడుపాయలలో జరిగిన ఘర్షణ వలన ఓ వ్యక్తి మృతి చెందగా ఏడుపాయల నాగసానిపల్లికి వచ్చిన ఎంఐఎం అనుబంధ సంస్థ మజిలీస్ బచావో తహరిక్ స్పోక్స్ పర్సన్ రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై చర్యలు తీసుకోవాలని పాపన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని రోజులు ఏడుపాయల మతసామరస్యానికి కేంద్రంగా ఉందని, ఇక్కడ అన్ని మతాల వారు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇటీవల ఇద్దరు దుకాణదారులు పడ్డ గొడవలో ఓ వ్యక్తి మరణించగా, దానిని మతపరమైనదిగా చిత్రీకరించిన అంజదుల్లా ఖాన్ ఎంపీ రఘునందన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఎంపీని విమర్శిస్తూ, ఎమ్మెల్యేను పొగడడమేంటని వారు ప్రశ్నించారు. మత సామరస్యానికి కేంద్రంగా ఉన్న ఏడుపాయల వద్ద కొంతమంది మతోన్మాద శక్తులు రెచ్చగొట్టె కార్యక్రమాలను స్థానిక ప్రజలందరూ తిప్పి కొట్టాలన్నారు. ఏడుపాయల్లో అన్యమతస్తులను ప్రోత్సహించడం వలన రాను రాను మరింత మంది మతోన్మాద శక్తులు పచ్చని ప్రాంతంలో చిచ్చుపెట్టాలని చూస్తారన్నారు. కాబట్టి ముందస్తు చర్యగా దేవస్థానం ఈవో స్పందించి అన్యమతస్తులను ఏడుపాయల నుంచి పంపించాలని విజ్ఞప్తి చేశారు. లేనిచో తామే పంపించే కార్యాచరణ చేపడతామన్నారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమతస్తులను ప్రోత్సహించడం దేవాదాయ శాఖకు సరికాదని, తర్వాత పరిణామాలకు దేవాదాయ శాఖనే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.