11-10-2025 08:45:31 PM
ఇసుక ర్యాంప్ అనుమతులను వెంటనే రద్దు చేయాలి..
జిల్లా కాంగ్రెస్ నాయకులు గురజాల..
మణుగూరు (విజయక్రాంతి): పోలీసుల సమక్షంలోనే ఇసుక ర్యాంపు నిర్వాహకుడు సామాన్య రైతుపై దాడికి తెగబడడం దారుణమని, అధికారులు వెంటనే ఇసుక ర్యాంప్ అనుమతులను రద్దు చేయాలని, జిల్లా కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి డిమాండ్ చేశారు. శనివారం రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపి మాట్లాడారు. కమలాపురం గ్రామస్తులు ఇసుక లారీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్కూలు విద్యార్థులు, రైతులకు లారీలతో ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు.
సమస్యను పరిష్కరించాల్సిన ఇసుక ర్యాంపు బినామీ గంటా రమేష్ పోలీసుల సమక్షంలోనే బాధితుడుపై తీవ్రంగా దాడి చేయడం సమంజసం కాదని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కమలాపురం ఇసుక ర్యాంపు అనుమతులను రద్దుచేసి గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఎండి షరీఫ్ పింగళి మాధవరెడ్డి, చారి, రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ, ఎండి షబానా, కోరి శ్యామల, రెడ్డి బోయిన రేణుక, కన్నాపురం వసంత, శైలజ, డాకూరి సౌజన్య పాల్గొన్నారు.