11-10-2025 08:15:24 PM
అందుకు సర్కారు సిద్ధంగా లేదు..
కాళేశ్వరం జలాలు లేకున్నా పంటలు పండినయ్..
ట్రిబ్యునల్లో మన వాదనలు గట్టిగా వినిపిస్తాం..
హరీష్ రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి..
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): కృష్ణా నదీ జలాలను వదులుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి చనిపోగా ఆయనను పరామర్శించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హన్మకొండకు వచ్చారు. అనంతరం మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదిలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణాకు చెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ విషయమై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్లో మన వాదనలు గట్టిగా వినిపించనున్నామన్నారు. కృష్ణలో 512 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఒప్పుకుందని ఆయన ఆరోపించారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ఉత్తగా ఉన్నా తెలంగాణలో అత్యధిక వరి పంట పండిందన్నారు.
గోదావరి కృష్ణాలో మోసం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడం సరికాదని, ఆయన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఏపీ సర్కారు చేపట్టే బనకచర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని, ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మంత్రి హోదాలో కృష్ణా ట్రిబ్యునల్ కి హాజరైన ఏకైక మంత్రిని నేనే అని ఉత్తమ్ స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి నీటి హక్కును కాపాడుకునే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి ఉందని, మన నీటి హక్కులను ఒక చుక్క కూడా వదులుకోమని, ఈ విషయాన్ని కేంద్రానికి ఇదే విషయం పదే పదే చెప్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.