19-11-2025 01:22:39 PM
హైదరాబాద్: నెక్లెస్ రోడ్ జంక్షన్‌లో ఇందిరమ్మ చీరాల పథకాన్ని(Indiramma Cheeralu Scheme) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు సీఎం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ జరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. చీరల పంపిణీ మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చీరల పంపిణీ కోసం నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. మండల కేంద్రాల్లో పండుగ వాతావరణంలో చీరల పంపిణీ జరగాలని చెప్పారు. ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఆర్థికంగా మహిళలన నిలబెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం స్పష్టం చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి.. వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. మహిళల వివరాలు సేకరించడం ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీల్లో 35 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తామని వివరించారు. మొత్తం తెలంగాణలో కోటి మంది మహిళలకు చీరల పంపిణీ.. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.