15-05-2025 09:14:50 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) గురువారం సాయంత్రం సరస్వతి పుష్కరాలకు(Saraswati Pushkaralu) హాజరుకానున్నారు. కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్లో 17 అడుగుల శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వరుడిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. అనంతరం సరస్వతి ఘాట్(Saraswati Ghat)లో సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారి సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. పుష్కరాల ప్రారంభోత్సవంలో పలువురు మంత్రులు పాల్గొనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు(Saraswati River Pushkaralu) గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి, మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ప్రారంభించారు. సరస్వతి పుష్కరిణి వద్ద శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి. సరస్వతి పుష్కరాల కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సరస్వతి పుష్కరాల కోసం రూ. 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. అధికారులు భక్తుల కోసం కాళేశ్వరంలో టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. సరస్వతి పుష్కారాలకు 3,500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. పుష్కరాల వద్ద 10 పడకల ఆసుపత్రి, 10 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పుష్కరాల వద్ద 36 మంది వైద్యులు, 450 మంది వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు.