15-05-2025 08:49:13 AM
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలో గురువారం ఉదయం వర్షం కురుస్తోంది. హైదరాబాద్(Hyderabad Rain)లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే జోరుగా వాన పడుతోంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్ పేట్, మణికొండ, రాయదుర్గం, హైటెక్ సిటీ, మాదాపూర్, మెహదీపట్నం, టోలీచౌకి, కోఠి, చందా నగర్, షేక్ పేట్, రాజేంద్రనగర్, కిస్మత్ పూర్, గండిపేట్, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల జోరువాన కురుస్తోంది. పిట్లం, పెద్దకొడపగల్ మండలాల్లో వాన బీభత్సం సృష్టించింది. నగరంలో ఉదయమే వర్షం కురవడంతో ఆఫీసులకు వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. భారత వాతావరణ శాఖ (India Meteorological Department) ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్, దాని పరిసరాలతో సహా 17 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. బుధవారం సాయంత్రం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినప్పటికీ, మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఏకాంత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.