16-01-2026 01:39:02 PM
రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణ ఏర్పాట్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి పర్యవేక్షించారు.
ఈ మట్టి బిడ్డకు ఘన స్వాగతం పలుకుదాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఈ మట్టి బిడ్డ కు మన సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణం 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా, ఉమ్మడి జిల్లాకు గుండెకాయ అయిన మహబూబ్‌నగర్ నగరంలో రూ.1463 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయడానికి మహబూబ్‌నగర్‌కు విచ్చేయనున్నారని తెలిపారు . గత ప్రభుత్వం మహబూబ్‌నగర్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ మట్టి బిడ్డగా, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి ఫలాలు అందించేందుకు వస్తున్న ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. సరస్వతి పుత్రులకు నిలయమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, జడ్చర్ల–దేవరకద్ర–మహబూబ్‌నగర్ మధ్య ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మహబూబ్‌నగర్‌కు వస్తున్నారని తెలిపారు.
మహబూబ్‌నగర్ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు రూ.603 కోట్లతో, శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.220 కోట్లతో, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లతో పాటు, మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీ గా అభివృద్ధి చేయడానికి రూ.20 కోట్లతో సహా అనేక అభివృద్ధి పథకాలకు రేపు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ చారిత్రక కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని, గౌరవ ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం పలకాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, బెక్కెరి మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు శాంతన్న యాదవ్, ఫయాజ్, తాహెర్, బాలస్వామి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.