16-01-2026 01:35:35 PM
రంగురంగుల ముగ్గులతో కళకళలాడిన వాడలు
గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేసిన యువకులు
ప్రత్యేక అలంకరణలో ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం
విజయక్రాంతి,పాపన్నపేట: మండల వ్యాప్తంగా సంక్రాంతి, కనుమ పండుగలను గురు, శుక్రవారాల్లో ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఇళ్ళ ముంగిట ముగ్గులు వేసి రంగులు దిద్ది బొబ్బెమ్మలు పెట్టి అందంగా తీర్చిదిద్దారు. యువకులు గాలిపటాలు ఎగురవేస్తూ డీజే పాటలతో సందడి చేశారు. పోటీ పడుతూ గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. పిండి వంటలను ఆస్వాదిస్తూ ఆనందోత్సహాల మధ్య పండుగను జరుపుకున్నారు.
ప్రత్యేక అలంకరణలో ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం..
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మను ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. భోగి మంటలు, హరిదాసు, గంగిరెద్దు, గాలిపటాలు, నవధాన్యాలు తదితరాలతో ఆలయ అర్చకులు పార్థివ శర్మ అందంగా అలంకరించారు. వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించిన అనంతరం వనదుర్గమ్మ ను అందంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శనం కల్పించారు.