03-09-2025 06:08:09 PM
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించారు. అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లబ్దిదారులతో కలిసి గృహప్రవేశాల్లో పాల్గొని.. గృహప్రవేశం చేస్తున్న లబ్దిదారులకు పట్టువస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైనదని.. తొలిదశ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా నుంచే మొదలైందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఖమ్మం గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల కళ్లలో ఆనందం చూస్తున్నామని.. సొంతిళ్లు అనేది పేదవాడి జీవితకాల స్వప్నం అని పేర్కొన్నారు.
రెండు పడక గదుల ఇల్లు వస్తుందనే ఆశతో పదేళ్లపాటు ఎదురుచూశారని, పదేళ్లలో ఏ పేదవాడికి సొంతింటి కల నేరవేరలే.. రెండు పడక గదుల ఇల్లు దక్కలేదని తెలిపారు. ఇల్లులేని ప్రతిపేదవాడికి ఇస్తామని గతంలో వైఎస్ఆర్ ప్రకటించారని, రాష్ట్రంలో 2004 నుంచి 2014 మధ్య 22 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించి ఇచ్చిందన్నారు. హనుమాన్ గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని పేర్కొన్నారు. గృహ, రెవెన్యూశాఖను నా దగ్గర ఉంచుకునే అవకాశం ఉన్నా.. పొంగులేటికి ఈ శాఖలను అప్పగించానని అన్నారు. గృహనిర్మాణ శాఖలను పొంగులేటి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి విజయవంతం చేశారని అన్నారు. పేదల కష్టాలు మాకు తెలుసు కాబట్టే.. పేదరికాన్ని రూపుమాపాలని నిర్ణయించుకున్నామని, రాష్ట్ర ప్రజలకు పదేళ్లపాటు.. కొత్త రేషన్ కార్డులు అంటే ఏంటో తెలియదని సీఎం అన్నారు. మా ప్రభుత్వం రాగానే లక్షలాది రేషన్ కార్డులు, ఇళ్లు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వంలో రూ. లక్ష కోట్లు దోచుకున్నారని, అక్రమ సంపాదన వాళ్లకు ఏం సంతృప్తినిచ్చిందని విమర్శించారు.