03-09-2025 07:52:16 PM
కాంగ్రెస్ పాలనంత అవినీతి మయం
బోడుప్పల్ లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు
బిఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి
మేడిపల్లి: మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రధాత కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించాడని కానీ ఎన్నో కలలు కని తెచ్చుకున్న తెలంగాణ ద్రోహుల చేతిలో చిక్కి విలవిలలాడుతుందని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి(BRS Party President Manda Sanjeeva Reddy) అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో అనేకమంది విభేదించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ ప్రాంత ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతారని కరెంటు ఉండదని వ్యవసాయం వెనుకబడుతుందని నక్సలిజం పెరిగి అభివృద్ధి పనులు జరగవని విమర్శించారని గుర్తు చేశారు. ఇటువంటి విమర్శలు చేసిన అనేకమంది నేడు అధికారంలో కొనసాగుతూ తెలంగాణను అన్ని రంగాల్లో బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ ను గుర్తించిన ప్రజలు 10 సంవత్సరాల పాటు ఆయనను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారని, అందుకు తగ్గట్టుగా పనిచేసిన కేసిఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని, రైతుబంధు రైతు బీమా, వంటి వినూత్న సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకున్నారని కొనియాడారు.
రాష్ట్రంలో ఉన్న తీరుగానే బోడుప్పల్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సైతం అవినీతి రాజ్యమేలుతుందని, పదవీకాలం ముగిసినప్పటికీ మాజీ మేయర్లు కార్పొరేటర్లు అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తమకు నచ్చిన విధంగా పనులు చేసుకుంటున్నారని, రెండు మున్సిపాలిటీల పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులను కార్యక్రమాలకు ఎలా ఆహ్వానిస్తారని, వారు ఆదేశాలను ఎందుకు పాటిస్తున్నారని సంజీవరెడ్డి ప్రశ్నించారు. అధికారుల తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, నాయకులు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.