01-12-2025 04:53:01 PM
హైదరాబాద్: వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని రూ.151.92 కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. జూరాల దిగువన రూ.121.92 కోట్లతో నిర్మించే హైలెవెల్ వంతెనకు, అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఇవాళ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణపేట జిల్లా మక్తల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నారాయణపేట-మక్తల్ మాధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, రూ.200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, మక్తల్ లో క్రీడాభవనం, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తుందని, రెండేళ్లు విజయోత్సవ సభను మొదట మక్తల్ లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్ నగర జిల్లా నిర్లక్ష్యానికి గురైందని, ఉమ్మడి పాలమూరు జిల్లాలకు ఏదైనా చేయాలని గతంలో ఏ నేత అనుకోలేదని సీఎం తెలిపారు. అందుకే ఈసారి పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారని గుర్తించారు.
తర్వాత 75 ఏళ్లలో పాలమూరు జిల్లా నుంచి ఎవరూ సీఎం కాలేరని, ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ రాష్ట్ర సీఎంగా మీ ముందు నిలబడ్డారని ఆయన వెల్లడించారు. దశాబ్దాలుగా పాలమూరు జిల్లా కరువు, వలసలకు మాత్రమే పేరుగాంచిందని, ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ జిల్లాకు ఏమీ చేయలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, ఈసారి పాలమూరు బిడ్డను గెలిపించి అధికారం కట్టబెట్టారని ఆయన కొనియాడారు. ఈసారి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించామని, పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్నారు.