01-12-2025 04:25:30 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి..
వనపర్తి (విజయక్రాంతి): తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. రూ.15 కోట్ల వ్యయంతో ఆత్మకూరు నగర అభివృద్ధి పనులకు, రూ.15 కోట్ల వ్యయంతో అమరచింత నగర అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.
ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటరు భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పిజెపి క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె. అరవింద్ ప్రసాద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు పూలబోకె ఇచ్చి స్వాగతం పలికగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు సహచర మంత్రులు వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి, వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి, గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, వనపర్తి జిల్లా ఎస్పీ డి. సునీత, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శశిధర్, ఇతర నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.